
ముంపులోనే..
ముప్పు తప్పినా..
● శాంతించిన గోదావరి, శబరి నదులు
● నీటిమట్టం తగ్గుముఖంతో భద్రాచలం వద్ద
మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ
● గ్రామాలను వీడని వరద నీరు
● కొనసాగని రాకపోకలు
కూనవరం– టేకులబోరు మధ్య
సినిమాహాల్ సెంటర్ వద్ద
వరద ముంపులో ఆర్‌అండ్‌బీ రహదారి
గోదావరి, శబరి నదులు శాంతించినా విలీన మండలాల్లో చాలా గ్రామాలు, రహదారులు ఇప్పటికీ ముంపులోనే ఉన్నాయి. గురువారం ఉగ్రరూపం దాల్చిన గోదావరి శుక్రవారం తగ్గుముఖంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. మూడు రోజులవుతున్నా చాలాచోట్ల నిత్యావసర సరకులు అందకపోవడతో వరద బాధితుల పరిస్థితి దయనీయంగా మారింది.
చింతూరు: విలీన మండలాల ప్రజలను రెండు రోజులపాటు బెంబేలెత్తించిన గోదావరి, శబరినదులు ఎట్టకేలకు శాంతించాయి. శుక్రవారం రాత్రి భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43 అడుగుల కంటే తగ్గడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. కూనవరం, వీఆర్‌పురం మండలాల్లోని గ్రామాల్లోకి చేరిన వరద కూడా తగ్గుముఖం పట్టింది. అయితే వరదనీరు ప్రధాన రహదారులపై నిలిచి ఉండటంతో పూర్తిస్థాయిలో రాకపోకలు కొనసాగడంలేదు.
తగ్గిన శబరి
గోదావరి తగ్గుతుండడంతో చింతూరు మండలంలో ఎగపోటుకు గురైన శబరినది ఉధృతి కూడా క్రమేపీ తగ్గుముఖం పట్టింది. చింతూరు వద్ద గురువారం రాత్రి 40 అడుగులకు చేరుకున్న శబరినది నీటిమట్టం తగ్గుతూ శుక్రవారం రాత్రికి 38 అడుగులకు చేరుకుంది. శబరినది తగ్గుముఖం పట్టడంతో నదీ పరివాహక గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
● శబరినది ఎగపోటుతో పొంగిన వాగుల వరద నీరు ఇంకా రహదారుల పైనే నిలిచి ఉంది. ఆంధ్రా, ఒడిశా మధ్య వరుసగా రెండోరోజు కూడా రాకపోకలు కొనసాగలేదు.
● సోకిలేరు, జల్లివారిగూడెం, చీకటివాగు, చంద్రవంక, కుయిగూరు వాగుల వరద కారణంగా చింతూరు నుంచి వీఆర్‌పురం మండలంలోని 25 గ్రామాలకు కూడా రాకపోకలు ప్రారంభం కాలేదు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు నాటు పడవల ద్వారా వరదనీటిలో ప్రయాణం సాగిస్తున్నారు.
కూనవరం: గోదావరి, శబరి నదులు శుక్రవారం మధ్యాహ్నం నుంచి శాంతించాయి. ఉదయభాస్కర్ కాలని, సినిమాహాల్ సెంటర్ వరద ముంపులో ఉన్నందున అక్కడి వారిని రెండవ రోజు కూడా టేకులబోరులో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రానికి తరలించారు. పోలీసుస్టేషన్ ఎదురుగా ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్డు నీరు ఎగదన్నడంతో శుక్రవారం కూడా కూనవరం నుంచి టేకులబోరుకు రాకపోకలు నిలిచిపోయాయి. కూనవరం – చట్టి, కోతులగుట్ట – పంద్రాజుపల్లి వద్ద రోడ్లు ఇప్పటికీ ముంపులోనే ఉన్నాయి. కూనవరం– భద్రాచలం, పోలిపాక – మురుమ్మూరు రోడ్లపై వరదనీరు కొనసాగుతోంది. టేకులబోరు– కొండ్రాజుపేట రోడ్డు నాలుగు రోజుల నుంచి వరద ముంపులోనే ఉంది. కూనవరంలో శుక్రవారం ఉదయం 5 గంటలకు 50.08 అడుగులకు పెరిగిన గోదావరి నీటిమట్టం మధ్యాహ్నం నుంచి తగ్గు ముఖం పట్టింది. సాయంత్రం ఐదు గంటలకు 48. అడుగుల వద్ద ఉంది.

ముంపులోనే..

ముంపులోనే..

ముంపులోనే..

ముంపులోనే..