
ఉపాధి హామీలో నిధుల దుర్వినియోగం
చింతపల్లి: మండలంలోని బలపం పంచాయతీలో ఉపాధి హామీ పథకంలో ఉద్యాన పంటల సాగు ప్రోత్సాహక నిధులను పక్కదారి పట్టించిన సిబ్బంది ఆరుగురిని డ్వామా పీడీ డాక్టర్ డీవీ విద్యాసాగర్ సస్పెండ్ చేశారు. మరొకరికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. వివరాలిలా ఉన్నాయి.
రైతుల ఫిర్యాదుతో..
2023–24 ఆర్థిక సంవత్సరంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో బలపం పంచాయితీ పరిధిలోని 220 మంది రైతులకు ఉద్యానవన మొక్కలు, 2023–24లో 26 మంది రైతులకు డ్రాగన్‌ఫ్రూట్ మొక్కలను పంపిణీ చేశారు. ఈ మేరకు రైతులకు అందజేయవలసిన ప్రోత్సాహక నిధులు రూ.20 లక్షలు ఉపాధి హామీ సిబ్బంది పక్కదోవ పట్టించారు. ఈనేపథ్యంలో మూడేళ్లయినా సాయం అందకపోవడంతో ఇదే పంచాయతీ పరిధిలోని గుంజివీధి, చెరువూరు గ్రామాలకు చెందిన రైతులు మీకోసంలో కలెక్టర్ దినేష్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు ఈనెల 5న డ్వామా పీడీ విద్యాసాగర్, ఏపీడీ లాలం సీతయ్య బలపంలో విచారణ నిర్వహించారు. నిధులు పక్కదారి పట్టించడాన్ని గుర్తించిన పీడీ ఫీల్డ్ అసిస్టెంట్ కోటి, టెక్నికల్ అసిస్టెంట్ అన్నపూర్ణ, టీఏ ప్రభాకరరావు (కొయ్యూరు), కంప్యూటర్ ఆపరేటర్ డి.రమణకుమారి, ఈసీ మధుసూదన్ (జి.మాడుగుల), ప్లాంట్ సూపర్‌వైజర్ పుష్కలరావును సస్పెండ్ చేశారు. అంతేకాకుండా బలపం ఫీల్డ్ అసిస్టెంట్ టిబ్రూకు షోకాజ్ నోటీసు ఇచ్చారు. బలపం ఫీల్డ్ అసిస్టెంట్ కోటి నుంచి రూ.12,95,614, టీఏ అన్నపూర్ణ నుంచి రూ.2,20,000, ఏపీకే కె. నారాయణమూర్తి నుంచి రూ.2,20.000, టీఏ ప్రభాకర్ నుంచి రూ.1,10,00, ఈసీ మధుసూదన్ నుంచి రూ.50,000, ప్లాంట్ సూపర్‌వైజర్ పుష్కలరావు నుంచి రూ.30,000 రికవరీ చేయాలిన ఉత్తర్వుల్లో పీడీ పేర్కొన్నారు.
బలపంలో ఉద్యానవన సాగు
ప్రోత్సాహక నిధులు పక్కదారి
ఆరుగురు సిబ్బంది సస్పెన్షన్
మరొకరికి షోకాజ్
డ్వామా పీడీ విద్యాసాగర్
ఉత్తర్వుల జారీ
బాధ్యుల నుంచి నిధుల
రికవరీకి ఆదేశాలు