
వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు గల్లంతు
పెదబయలు/జి.మాడుగుల: జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో గురువారం ఇద్దరు గల్లంతయ్యారు. పెదబయలు మండలం గిన్నెలకోట పంచాయతీ పిట్టలబొర్ర జలపాతంలో బీటెక్ విద్యార్థి గొ న్నురు కిశోర్, జి.మాడుగుల మండలం గుర్రాయి గ్రామ సమీపంలో గల గుర్రాయిగెడ్డలో మహి వరప్రసాద్ అనే బాలుడు గల్లంతయ్యారు. వివరాలు...విశాఖ జిల్లా పెందుర్తిలో గల వెల్ఫేర్ ఎడ్యుకేషన్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు గ్రామానికి చెందిన గొన్నురు కిశోర్ తన పుట్టిన రోజు వేడుకలను అరకులోయలో శుక్రవారం జరుపుకోవాలని భావించాడు. ఇందుకోసం తన ముగ్గురు స్నేహితులతో కలిసి బుధవారం రాత్రి పెందుర్తి నుంచి రెండు బైక్‌లపై బయలుదేరాడు. రాత్రి రెండు గంటలకు గొన్నురు కిశోర్, స్నేహితులు లోకవరపు చంద్రశేఖర్, పాడి శ్యామ్యూల్,కమ్మనైని సంతోష్ అరకువేలి చేరుకుని, బసచేశారు. గురువారం ఉదయం 7.30 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి పెదబయలు మీదుగా పిట్టలబొర్ర వెళ్లారు. నలుగురు జలపాతం వద్ద సెల్‌ఫోన్లలో సెల్ఫీలు తీసుకుని ఆనందంగా గడిపారు. అనంతరం ఈత కొట్టేందుకు జలపాతంలోకి దిగారు. కిశోర్(22) జలపాతంలోని సొరంగ ప్రాంతంలోకి వెళ్లి మునిగిపోయాడు. గమనించిన మిగిలిన ముగ్గురు స్నేహితులు వెంటనే స్థానికులకు సమాచారం ఇచ్చారు. ఆ ప్రాంతం లోతుగా ఉండడం వల్ల అందులోకి దిగేందుకు ఎవరూ సాహసించలేదు. ఇక్కడ లోతైన సొరంగం ఉందని చెప్పినా వారు వినిపించుకోలేదని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ కె.రమణ తెలిపారు. చీకటి పడడంతో శుక్రవారం ఉదయం గాలింపు చర్యలు చేపట్టనున్నట్టు ఆయన చెప్పారు. కిశోర్ తల్లి,అక్క, బంధువులకు సమాచారం పంపినట్టు ఎస్‌ఐ తెలిపారు. కిశోర్ శుక్రవారం అరకులోయలో తన పుట్టిరోజు వేడుకలను జరుపుకోవల్సి ఉండగా...ఇంతలో ప్రమాదానికి గురయ్యాడు. గత ఏడాది మే 25తేదీన అరకులోయ మండలం మాడగడ పంచాయతీ దొరగుడ గ్రామానికి చెందిన సమరెడ్డి అరుణ్‌కుమార్(24) అనే యువకుడు ఈ జలపాతం వద్ద సెల్ఫీ తీసుకుంటూ కాలుజారిపడి సుడిగుండలో మునిగి గల్లంతయ్యాడు.
ఈత కోసం వెళ్లి...
జి.మాడుగుల మండలం సింగర్భ పంచాయతీ చెరువువీధి గ్రామానికి చెందిన ఉల్లి మహి వరప్రసాద్(14) అనే బాలుడు, తన ఐదుగురు స్నేహితులు బొర్రమామిడి గ్రామానికి చెందిన పాంగిబాబు, తీగలమెట్ట గ్రామానికి చెందిన కొర్ర చలపతి, పాంగి వంశీ, పాంగి నాగేశ్వరరావు, గుప్పవీధికి చెందిన కొర్రా కిరణ్ సాయికుమార్‌తో కలసి గుర్రాయి గెడ్డలో ఈతకొట్టడానికి గురువారం సాయంత్రం ఓ ఆటో వెళ్లాడు. ఇద్దరు బయట ఉండగా, నలుగురు గెడ్డలో దిగి ఈతకొడుతూ పెద్ద పనుకుపై నుంచి జాలువారే నీటి ప్రవాహంలో జారుతూ సరదాగా గడిపారు. ఆ సమయంలో వరప్రసాద్ గెడ్డ ప్రవాహంలో కొట్టుకుపోయి అక్కడున్న ఊబిలో కూరుకుపోయాడు. వరప్రసాద్ కోసం గెడ్డలో చాలా సమయం గాలించినా కనిపించలేదని స్నేహితులు తెలిపారు. సమాచారం తెలిసిన తండ్రి సత్తిబాబు, కుటుంబ సభ్యులు గెడ్డ వద్దకు వెళ్లి గాలించారు. అయినా ప్రయోజనం లేకపోయింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందాల్సి ఉంది.
పుట్టిన రోజు వేడుకలు
జరుపుకొనేందుకు వెళ్లి
ప్రమాదానికి గురైన బీటెక్ విద్యార్థి
ఈతకోసం వెళ్లి గెడ్డ ప్రవాహంలో కొట్టుకుపోయిన బాలుడు
పెదబయలు, జి.మాడుగుల
మండలాల్లో ఘటనలు

వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు గల్లంతు