రబ్బరు రైతులకు ప్రోత్సాహం | Sakshi
Sakshi News home page

రబ్బరు రైతులకు ప్రోత్సాహం

Published Wed, May 22 2024 10:20 AM

రబ్బరు రైతులకు ప్రోత్సాహం

రంపచోడవరం: ఏజెన్సీలో కొత్తగా రబ్బరు తోటలు వేసే రైతులను గుర్తించి, వారిని అన్నిరకాలుగా ప్రోత్సహిస్తామని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సూరజ్‌ గనోరే తెలిపారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో మంగళవారం కొత్త రబ్బర్‌ ప్లాంటేషన్‌ రైతుల గుర్తింపు, అందించాల్సిన ప్రోత్సాహంపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మారేడుమిల్లి, వై.రామవరం మండలం ఎగువ ప్రాంతం, రంపచోడవరం మండలాల్లోని గ్రామాలలో కొత్త రబ్బర్‌ ప్లాంటేషన్‌ వేసుకునే రైతులకు ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. ఉపాధి హామీ పథకం పీవోలు, హార్టీకల్చర్‌ అసిస్టెంట్లు, అగ్రికల్చర్‌ అసిస్టెంట్లు, రబ్బర్‌ బోర్డు అధికారులు కలిసి కొత్తగా రబ్బరు సాగు చేసే రైతులను గుర్తించాలని సూచించారు. వారం రోజులలో రైతులను గుర్తించి నివేదిక సమర్పించాలని ఆదేశించారు.ప్రస్తుతం 1,250 ఎకరాలలో ఉపాధి హామీ పథకం ద్వారా రబ్బర్‌ ప్లాంటేషన్‌ జరుగుతోందన్నారు. ఎకరాకు సుమారు 200ల మొక్కలు ఇస్తారన్నారు. వీటిని రైతులు మూడేళ్లపాటు పెంచుకునేందుకు రూ.1.64 లక్షలు ఉపాధి హామీ పథకం ద్వారా, రబ్బర్‌ బోర్డు ద్వారా రూ.14,400లు ఇస్తారన్నారు. మొత్తం రూ.1.75 లక్షలు మూడేళ్లకు చెల్లింపు జరుగుతుందని పీవో తెలిపారు. రబ్బరు రైతులు కంచెలు ఏర్పాటు చేసుకోవడం, మొక్కలకు నీళ్లు పోయడం, ఎరువులు వేయడం, రైతువారి ప్లాంటేషన్‌ పనులు చేసేందుకు ఉపాధి పనుల ద్వారా కూలీలకు నిధులు చెల్లింపు జరుగుతుందన్నారు. రబ్బర్‌ చెట్లు పెంచేందుకు భూమి అనువుగా ఉన్నదీ లేనిదీ గుర్తించాలని, నీటి సదుపాయం ఉన్నదీ లేనిదీ చూడాలని సూచించారు. రబ్బర్‌ ప్లాంటేషన్‌ చేసే రైతులకు ఐదు ఎకరాల లోపు భూమి ఉండాలని, అటువంటి వారు మాత్రమే అర్హులని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పీహెచ్‌వో చిట్టిబాబు, ఉపాధి హామీ పథకం పీడీ జి.శ్రీనివాస్‌, పీఏవో జి.రాంబాబు, రబ్బర్‌ బోర్డు ఏడీవో శరత్‌ చంద్‌, ఏడీఏ సిహెచ్‌.కె.వి.చౌదరి పాల్గొన్నారు.

మొక్కల పెంపకానికి

ఉపాధి హామీ నిధులు

రంపచోడవరం ఐటీడీఏ పీవో

సూరజ్‌గనోరే

Advertisement
 
Advertisement
 
Advertisement