ప్రైవేటు.. సెపరేటు! | - | Sakshi
Sakshi News home page

ప్రైవేటు.. సెపరేటు!

Nov 18 2026 12:08 AM | Updated on Nov 18 2026 12:08 AM

జిల్లాలో పత్తి ధరల్లో వ్యత్యాసం ఆదిలాబాద్‌తో పోల్చితే ఇచ్చోడలో ఎక్కువ క్వింటాలుకు రూ.180 అధికం విక్రయాలు పెరుగుతున్న వేళ.. మార్కెట్‌ మాయాజాలం

ఆదిలాబాద్‌లో పత్తి క్వింటాలుకు రూ.9,120.. ఇచ్చోడలో మాత్రం రూ.9,300.. జిల్లాలో 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న రెండు వ్యవసాయ మార్కెట్లలో మంగళవారం ప్రైవేట్‌లో పలి కిన ధరలివి. అయితే జిల్లా కేంద్రంలో అమ్మిన రైతులు క్వింటాలుకు రూ.180 చొప్పున నష్టపోవాల్సి వచ్చింది. ఇదేదో స్వల్పం అనుకుంటే పొరపాటే. ఈ ఒక్క రోజు విక్రయించిన వేలక్వింటా ళ్ల పరంగా చూస్తే లక్షల రూపాయలు వ్యాపారులు లూటీ చేసినట్టే. – సాక్షి,ఆదిలాబాద్‌

పత్తి కొనుగోళ్లలో ఆదిలాబాద్‌లో వ్యాపారులు మాయాజాలం మొదలెట్టారు. రైతు నెత్తిన శఠగోపం పెడుతున్నారు. బహిరంగ మార్కెట్లో పత్తికి అధిక ధర ఉన్నప్పటికీ తక్కువ చెల్లిస్తున్నారు. స్వలాభమే తప్పా రైతు కష్టాన్ని పట్టించుకోవడం లేదు. ఈ పరిస్థితుల్లో తెల్లబంగారంపై గంపెడాశతో ఉన్న రైతులు నష్టపోవాల్సి వస్తుంది. పత్తి కొనుగోళ్ల పరంగా ఆదిలాబాద్‌ మార్కెట్‌కు రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానం ఉంది. సీజన్‌లో రోజు వేలాది మంది రైతులు లక్షలాది క్వింటాళ్ల పత్తిని విక్రయిస్తారు. అలాంటిచోట రైతు దగాకు గురవుతున్నాడు.

ఇప్పుడిప్పుడే పెరుగుతున్న విక్రయాలు..

జిల్లాలో పత్తి కొనుగోళ్లు అక్టోబర్‌ 22న మొదలయ్యాయి. మొదటిరోజు క్వింటాలుకు ప్రైవేట్‌లో రూ.9,200లకు పైగా ధర పలికింది. ఈ ధర మరింత పెరుగుతుందని భావించిన రైతులు పంట అమ్మే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దిగుబడులు అంతంత మాత్రమే ఉన్నప్పటికీ నిల్వ చేసి అధిక ధర పలికేరోజు విక్రయించాలని భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మార్కెట్‌ పత్తి విక్రయాల పరంగా బోసిపోయింది. రోజు తక్కువ మంది మార్కెట్‌కు రావడం, స్వల్పంగా అమ్మడంతో ఇన్నిరోజులు నామమాత్రంగానే విక్రయాలు జరిగాయి. ఈ సీజన్‌లో మొదటిసారి ఆదిలాబాద్‌ మార్కెట్లో సోమవారం 728 మంది రైతులు 14,452 క్వింటాళ్ల పత్తిని విక్రయించారు. మొదటిసారి పదివేల క్వింటాళ్లు దాటడం గమనార్హం. మంగళవారం కూడా ఆదిలాబాద్‌ మార్కెట్లో ఇదే పరిస్థితి కొనసాగింది.

ధర వ్యత్యాసంతో..

ఇచ్చోడ మార్కెట్‌ కంటే ఆదిలాబాద్‌ మార్కెట్లో క్వింటాలుకు రూ.180 తక్కువ ధర కల్పించడంతో మంగళవారం ఈ మార్కెట్లో పత్తి విక్రయించిన రైతుల సంఖ్య, అమ్మిన క్వింటాళ్ల పరంగా చూస్తే వ్యాపారులు రూ.25 లక్షల వరకు రైతులకు నష్టం కలిగించారు. పక్కపక్కనే ఉన్న వ్యవసాయ మార్కెట్‌ కమిటీల్లో తేడా ఉన్నప్పటికీ అధికారులు దృష్టి సారించకపోవడం చోద్యంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఆదిలాబాద్‌ మార్కెట్లో పత్తి విక్రయాలు క్రమంగా పెరుగుతుండగా, ఈ ధర వ్యత్యాసంపై పత్తిని అమ్మిన రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.

ఆదిలాబాద్‌లో పత్తి నిల్వలు (ఫైల్‌)

పత్తి విక్రయాల వివరాలు..

జిల్లాలో విక్రయించిన రైతులు : 7,316

మొత్తం క్వింటాళ్లు : 1,41,007

ఆదిలాబాద్‌లో విక్రయించిన రైతులు : 6082

మొత్తం క్వింటాళ్లు : 1,21,945

జిల్లాలో పరిస్థితి..

జిల్లాలో ఆదిలాబాద్‌, బోథ్‌, నేరడిగొండ, పొచ్చర, సొనాల, ఇచ్చోడ, గుడిహత్నూర్‌లలో పత్తి కొనుగోళ్లు ప్రారంభించగా, ఇంద్రవెల్లి, నార్నూర్‌లో ఇంకా ప్రారంభించాల్సి ఉంది. సీసీఐ మద్దతు ధర రూ.8,667 ఉండగా, బహిరంగ మార్కెట్లో రూ.9వేల పైబడి పలుకుతుంది. ప్రధానంగా క్యాండి (354 కిలోల దూది) ధర రూ.68వేలు, పత్తి గింజల ధర క్వింటాలుకు రూ.4700 పలుకుతుండడంతో పత్తి రేటు కొద్ది రోజులుగా పెరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement