● ఖానాపూర్ సుందరీకరణపై ఆశలు
కై లాస్‌నగర్: ఆదిలాబాద్ పట్టణంలోని ఖానాపూర్ చెరువు సుందరీకరణకు అడ్డంకిగా మారిన ఆక్రమణల తొలగింపుపై యంత్రాంగం ఎట్టకేలకు దృష్టి సారించింది. మున్సిపల్, రెవెన్యూ, పోలీస్ అధికారులతో కూడిన ప్రత్యేక బృందం మంగళవారం ఈ ప్రక్రియను ప్రారంభించింది. ఓ ఆక్రమణ భవనానికి సంబంధించిన ప్రహరీ కూల్చివేసి శ్రీకారం చుట్టింది. దీంతో సుందరీకరణపై పట్టణ వాసుల్లో ఆశలు మొదలయ్యాయి. అయితే ప్రక్రియను కొనసాగిస్తారా లేక రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి వెనుకడుగు వేస్తారా అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
నాన్చుడు ధోరణే..
114 ఎకరాల విస్తీర్ణంతో కూడిన ఖానాపూర్ చెరువు చాలావరకు ఆక్రమణలకు గురైంది. సుందరీకరణకు ఇదే ప్రధాన అడ్డంకిగా మారింది. మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు చెరువులో ప్రత్యేక సర్వే నిర్వహించి 126 ఇళ్లు అక్రమంగా నిర్మించినట్లుగా నిర్ధారించారు. మార్క్ చేశారు. వాటిని తొలగిస్తేనే అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ విభాగం స్పష్టం చేసింది. మరోవైపు ఆక్రమణలు తొలగిస్తామని అధికారులు ప్రకటించినా నాన్చివేత వీడలేదు. తొలుత దసరా అని.. తర్వాత దీపావళి అనంతరం తొలగిస్తామని చెబుతూ వచ్చారు. ఇటీవల మున్సిపల్ అధికారులతో సమావేశమైన ఉన్నతాధికారులు చెరువు సుందరీకరణకు అడ్డంకిగా మారిన ఆక్రమణలపై కఠినంగానే వ్యవహరించాలని ఆదేశించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మున్సిపల్, రెవెన్యూ అధికారులు ఆ దిశగా చర్యలకు ఉపక్రమించినట్లుగా తెలుస్తోంది. అయితే ఆక్రమణదారులు స్వచ్ఛందంగా నిర్మాణాలు తొలగిస్తే వారికి డబుల్ బెడ్‌రూం ఇళ్లతో పా టు ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించేందుకు యంత్రాంగం సుముఖంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అయినప్పటికీ రాజకీయ అండతో ఆక్రమణదా రులు అక్కడి నుంచి కదలడం లేదనే విమర్శలు న్నాయి. ఈ పరిస్థితుల్లో అధికారులు వాటి తొలగింపునకు చర్యలు చేపట్టడం సుందరీకరణ దిశగా అడుగులు పడినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ తొ లగింపు ప్రక్రియ సాఫీగా సాగుతుందా లేక రాజ కీయ ఒత్తిళ్ల కారణంగా మళ్లీ నిలిచిపోతుందా అనేది చర్చనీయాంశంగా మారింది. ప్రజాప్రతినిధులు, అధికారులు ఆక్రమణలు తొలగించి చెరువు సుందరీకరణ చేపట్టడం ద్వారా పర్యాటకరంగాన్ని బలో పేతం చేయాలని పట్టణవాసులు కోరుతున్నారు.
ఇదీ పరిస్థితి..
చెరువులకు పునరుజ్జీవం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అమృత్–2 పథకం కింద పట్టణంలోని ఖానాపూర్ చెరువును ఎంపిక చేసింది. సుందరీకరణ కోసం రూ.3.14కోట్ల నిధులను గతేడాది డిసెంబర్‌లో మంజూరు చేసింది. భూగర్భజలాలు పెంపొందించడంతో పాటు మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేసి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలనేది ఈ పథకం ఉద్దేశం. చెరువు కట్ట బలోపేతం, రెయిలింగ్ ఏర్పాటు, పార్కు, వాకింగ్ ట్రాక్, ఓపెన్‌జిమ్, లైటింగ్, పచ్చదనం పెంపొందించే పనులతో పాటు కట్టపై సోలార్ ప్యానెల్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ విభాగం అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం అప్పట్లోనే టెండర్ పిలిచి కాంట్రాక్టర్‌తో అగ్రిమెంట్ సైతం ఈ ఏడాది ఫిబ్రవరిలో కుదుర్చుకున్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు సైతం ఈ ఏడాది ఏప్రిల్ 20న శిలాఫలకాన్ని ఆవిష్కరించి సుందరీకరణ పనులు ప్రారంభించడం గమనార్హం.


