కై లాస్‌నగర్: ఇటీవల పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించిన రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల్లో వసూలయ్యే జనరల్ ఫండ్ నిధుల వినియోగ బాధ్యతలను పాలకవర్గాలకే అప్పగించింది. ఇందు కోసం ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాలు తెరువాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ దిశగా పంచాయతీ కార్యదర్శులు దృష్టి సారించారు. తాజా నిర్ణయంతో జనరల్ ఫండ్ వినియోగంలో ట్రెజరీ ఫ్రీజింగ్ తిప్పలు దూరం కానుండగా గ్రామ అవసరాల మేరకు వినియోగించుకునే వెసులుబాటు కలగనుంది.
ట్రెజరీ కష్టాలకు చెక్ ..
జీపీలకు పలు మార్గాల్లో ఆదాయం సమకూరుతుంది. ప్రధానంగా ఆస్తిపన్ను కీలకం. పెద్ద పంచాయతీలకు రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు వచ్చే అవకాశముండగా చిన్న జీపీలకు రూ.25వేల నుంచి రూ.50వేల వరకు సమకూరే అవకాశాలుంటాయి. వీటితో పాటు తైబజార్, వార సంతలు, లేఅవుట్‌లు, భవన నిర్మాణ అనుమతులు, ట్రేడ్ లైసెన్స్‌లు , మ్యుటేషన్ వంటి సేవల ద్వారా కూడా ఆదాయం చేకూరుతుంది. ఈ మొత్తాన్ని పంచాయతీ జనరల్ ఫండ్ కింద జమ చేస్తారు. ఇప్పటి వరకు ఈ నిధులన్నీ ట్రెజరీ ఖాతాలోనే జమయ్యేవి. వాటిని డ్రా చేసుకునేందుకు కార్యదర్శులు చెక్కులు రాసి ట్రెజరీకి పంపితే నెలల తరబడి నిధులు పొందలేని పరిస్థితి ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఖాతాలను ఫ్రీజింగ్‌లో పెట్టడం ద్వారా చెక్కులు పాసయ్యేవి కావు. ఆర్థిక సంవత్సరం ముగింపు సమయంలో, కాల పరిమితి దాటితే చెల్లుబాటయ్యేవికావు. దీంతో ఖాతాల్లో నిధులున్నా అవసరాల మేరకు పంచాయతీలు వాటిని వాడుకోలేని పరిస్థితి ఉండేది. ఈ పరిస్థితిని గుర్తించిన ప్రభుత్వం పంచాయతీలే జనరల్ ఫండ్ వినియోగించుకునేలా నిర్ణయం తీసుకుంది.
ఖాతాల ఓపెన్‌కు ఆదేశాలు
రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల నిధుల వినియోగంలో పాలకవర్గాలకు స్వేచ్ఛ కల్పించేలా నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ప్రత్యేక బ్యాంకు ఖాతాలు తెరువాలని ఆదేశాలు జారీ చేసింది. వారంలోపు ఈ ప్రక్రియ పూర్తి చేసేలా కార్యదర్శులు చర్యలు చేపడతున్నారు. తద్వారా గ్రామాల్లోని చిన్నపాటి సమస్యలను పరిష్కరించుకునే అవకాశం పంచాయతీలకు కలగుతుంది.
– జి.రమేశ్, జిల్లా పంచాయతీ అధికారి
జిల్లాలో
గ్రామీణ మండలాలు : 20
పంచాయతీలు : 473
జనరల్ ఫండ్ : రూ.10 కోట్లు


