అడుగంటుతున్న భూగర్భ జలాలు
ఎల్‌నినో సంక్షోభం నేపథ్యంలో అప్రమత్తం
ఆరుతడి పంటలే శ్రేయస్కరమంటున్న ప్రభుత్వం
రాయితీపై శనగ, నువ్వులు, పెసర్లు, మినుము విత్తనాలు
సాక్షి,ఆదిలాబాద్: యాసంగి సాగు రైతన్నకు ఓన్‌రిస్క్‌గా పరిగణించే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎల్‌నినో ప్రభావంతో సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆరుతడి పంటలే శ్రేయస్కరమని చెబుతోంది. నీటి వసతి ఉంటేనే సాగు చేయాలని స్పష్టం చేస్తోంది. అలా కాదని సాధారణ సాగుకు వెళ్తే రిస్క్‌ను భరించేందుకు సిద్ధంగా ఉండాలంటోంది. యాసంగిలో జిల్లాకు సంబంధించి అక్టోబర్ మాసంలో శనగ, గోధుమ అధిక మొత్తంలో సాగు చేస్తారు. జనవరి మాసంలో నువ్వులు, జొన్న, మొక్కజొన్న వంటి పంటలపై రైతులు మొగ్గుచూపుతారు. జిల్లాలో వరి సాగు స్వల్పంగా ఉంటుంది. ఎల్‌నినో ప్రభావం కారణంగా అప్రమత్తమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు వివిధ సూచనలు, సలహాలు జారీ చేస్తున్నారు. శనగ, నువ్వులు, మినుములు, పెసర్లు సాగు చేయాలని స్పష్టం చేస్తున్నారు. వరి, జొన్న, మొక్కజొన్న అసలుకే వేయవద్దంటున్నారు.
అడుగంటుతున్న భూగర్భ జలాలు
ఎల్‌నినో ప్రభావం కారణంగా జిల్లాలో వానాకాలం సీజన్‌లో ఏకంగా 33 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఆ పరిస్థితులతో జిల్లాలో భూగర్భ జలాలు గణనీయంగా అడుగంటుతున్నాయి. అక్టోబర్‌లో భూ ఉపరితలం నుంచి 4.06 మీటర్ల లోతులో నీటి లభ్యత ఉండగా, ఇది మరింత పెరిగిపోయింది. ఇక జిల్లాలోని సాత్నాల, మత్తడివాగు ప్రాజెక్టుల్లో నీటిమట్టం కొంత పర్వాలేకున్నా, జిల్లాలోని చెరువులన్నీ పూర్తిగా ఎండిపోయే దశకు చేరుకున్నాయి. జిల్లాలో 290కి పైగా చెరువులు ఉండగా, వీటి కింద సుమారు 30వేల ఎకరాలకు పైగా ఆయకట్టు ఉంది.
ఓన్‌రిస్క్ ఎందుకంటే..
చెరువులు పూర్తిగా ఎండిపోతున్నాయి. భూగర్భజలాలు పడిపోతున్నాయి. సాత్నాల, మత్తడివాగు ప్రాజెక్ట్‌లలో కొంత నీటి సామర్థ్యం ఉన్నప్పటికీ ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో జలాలు అడుగంటిపోయే పరిస్థితులు లేకపోలేదు. యాసంగి సాగులో ఈ రెండు ప్రాజెక్ట్‌ల ద్వారా సుమారు 30వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో నీటి విడుదలపై రైతులు భరోసా పెట్టుకోవద్దని ప్రభుత్వం చెబుతోంది. నీటి వసతి ఉన్న రైతులు మాత్రమే పంటలు సాగు చేయాలని సూచిస్తోంది.
రాయితీపై విత్తనాలు
యాసంగిలో సుమారు 60 వేల నుంచి 70వేల ఎకరాల వరకు పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా. శనగ సాగు అత్యధికంగా సుమారు 50 వేల వరకు ఉంటుందని భావిస్తోంది. శనగ విత్తనాలను 40 శాతం నుంచి మొదలుకుంటే వంద శాతం వరకు రాయితీపై రైతులకు అందిస్తున్నారు. ఇక మినుము, పెసర, నువ్వులను వంద శాతం రాయితీపై అందజేస్తున్నారు. సంబంధిత వ్యవసాయ అధికారులను సంప్రదించి రైతులు విత్తనాలు తీసుకోవాలని చెబుతున్నారు. అయితే ఇక్కడ నీటి వసతి ఉంటేనే ఆ విత్తనాలు ఇచ్చే పరిస్థితి ఉందని స్పష్టం చేస్తున్నారు.


