ఎల్‌నినోపై ప్రకటనలకే పరిమితమా..? | - | Sakshi
Sakshi News home page

ఎల్‌నినోపై ప్రకటనలకే పరిమితమా..?

Oct 20 2026 12:20 AM | Updated on Oct 20 2026 12:20 AM

● క్షేత్రస్థాయిలో కరువైన చర్యలు ● అడుగంటుతున్న భూగర్భజలాలు ● రబీకి సిద్ధమవుతున్న రైతులు ● అవగాహన కల్పించకుంటే నష్టపోయే ప్రమాదం

బోథ్‌: ఎల్‌నినో ప్రభావంతో ఇప్పటికే వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. అక్టోబర్‌ నుంచే భూగర్భ జలమట్టాలు తగ్గుముఖం పట్టడంతో భవిష్యత్తులో తాగునీటి కొరత ఏర్పడే అవకాశం ఉంది. మరోవైపు రబీ సీజన్‌లో పంటల సాగుకు సరిపడా నీరు అందుబాటులో ఉంటుందా లేదా అనే సందేహాలు రైతులను వెంటాడుతున్నాయి. ఎల్‌నినోపై ప్రకటనలు చేస్తున్న ప్రభుత్వం క్షేత్రస్థాయిలో మాత్రం తగిన చర్యలు చేపట్టడం లేదనే విమర్శలున్నాయి.

ప్రకటనలకే పరిమితమా?

నీటిని పొదుపుగా వినియోగించాలని, రానున్న నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రకటనలు చేస్తున్నారు. అయితే గ్రామాల్లో ఇప్పటికీ ఇంకా ఎలాంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టడం లేదు. రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై సూచనలు ఇవ్వడం లేదని తెలుస్తోంది. కేవలం మీడియా ద్వారా సందేశాలు ఇవ్వడం మాత్రమే కాకుండా వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యాచరణ అవసరం ఉంది.

అవగాహన తప్పనిసరి

ప్రతి గ్రామంలో రైతులతో సమావేశాలు నిర్వహించి భూగర్భ జలాల పరిస్థితి, రబీ సాగు అవకాశాలు, నీటి లభ్యతపై వ్యవసాయ అధికారులు వివరించాలి. ఆయా ప్రాంతాలు, నీటి లభ్యతలను బట్టి సాగునీరు పరిమితంగా ఉంటే తక్కువ నీరు అవసరమయ్యే ఆరుతడి పంటలు సాగు చేసుకునేలా రైతులకు అవగాహన కల్పించాలి. నీటి లభ్యతను అంచనా వేయకుండా అధిక నీరు అవసరమయ్యే పంటలు సాగు చేస్తే పెట్టుబడులు నష్టపోయే ప్రమాదం ఉందని వివరించాలి. కొన్నిచోట్ల రైతులు ఇప్పటికే సోయా చేతికి రాగానే జొన్న వేశారు.

క్షేత్రస్థాయిలో కార్యాచరణ ఏదీ?

నీటి కొరత ఏర్పడిన తర్వాత స్పందించడం కంటే ముందుగానే అప్రమత్తం కావడం ముఖ్యం. గ్రామాల వారీగా నీటి వనరుల పరిస్థితిని సమీక్షించి, తాగునీటి అవసరాలు, వ్యవసాయ అవసరాలపై ప్రణాళిక రూపొందించాలి. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు, రైతులకు అవసరమైన సూచనలు అందించాలి. ఎల్‌నినో ప్రభావంపై హెచ్చరికలు వస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో సన్నద్ధత కనిపించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికై నా ప్రభుత్వ యంత్రాంగం ప్రకటనలకు పరిమితం కాకుండా గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించి, రైతులకు సాగు మార్గదర్శకాలు అందించాలి.

22 నుంచి అవగాహన సదస్సులు

ఎల్‌నినో ప్రభావం, ప్రస్తుత భూగర్భ జలాల పరిస్థితులపై రైతుల్లో అవగాహన కల్పించేందుకు ఈ నెల 22నుంచి అవగాహన సదస్సులు చేపడుతున్నాం. ప్రతీ గ్రామాన్ని సందర్శించి రైతులతో ముఖాముఖి సమావేశాలు నిర్వహిస్తాం. ఈ సదస్సుల్లో వ్యవసాయ అధికారులతో పాటు వ్యవసాయ శాస్త్రవేత్తలు ప్రత్యక్షంగా పాల్గొంటారు. ప్రత్యామ్నాయ ఆరుతడి పంటలను వివరిస్తారు.

– రవీందర్‌ సింగ్‌, జిల్లా వ్యవసాయాధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement