కుభీర్: మండలంలోని జామ్‌గాంలో బొమ్మెడి మల్లేశ్ అనే రైతుకు చెందిన ఎద్దు విద్యుదాఘాతంతో మృతి చెందింది. ఆదివారం ఉదయం రైతు తన ఎద్దులను పంటచేనుకు తోలుకెళ్తుండగా శనివారం రాత్రి వీచిన గాలులకు తెగి రోడ్డుపై పడిపోయిన విద్యుత్ తీగకు ఎద్దు తగలడంతో షాక్‌కు గురై మృతి చెందింది. గ్రామస్తులకు సమాచారం అందించడంతో విద్యుత్ సరఫరా నిలిపివేయించారు. ఎద్దు విలువ రూ.50 వేలు ఉంటుందని, ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని బాధిత రైతు కోరుతున్నాడు.
గేదెలు తరలిస్తున్న
ఆరుగురిపై కేసు
దహెగాం: అక్రమంగా గేదెలు తరలిస్తున్న ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై చుంచు రమేశ్ తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు ఆదివారం మండలంలోని కల్వాడ చెక్‌పోస్టు వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా ఐచర్ వాహనంలో 11 గేదెలు, బొలెరో వాహనంలో ఏడు గేదెలు పట్టుబడినట్లు ఆయన పేర్కొన్నారు. నిందితులను విచారించగా చింతలమానెపల్లి నుండి జగిత్యాలకు తరలిస్తున్నట్లు తెలిపారు. వాహనాలు, గేదెలు స్వాధీనం చేసుకుని నిందితులు ఎండీ అహ్మద్, షేక్ ఫిరోజ్, అబ్దుల్ సమీర్, షాహీద్ అలీ, ఎండీ అబ్బుషేక్, సర్వర్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
రైలు ఢీకొని ఒకరు మృతి
బెల్లంపల్లి: రైలు ఢీకొని ఒకరు మృతి చెందిన సంఘటన పట్టణంలో చోటు చేసుకుంది. జీఆర్‌పీ హెడ్ కానిస్టేబుల్ కె.తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం మధ్యాహ్నం కన్నాలబస్తీకి చెందిన కన్నెపల్లి నాగేశ్వరరావు (55) కన్నాల గేటు వద్ద రైలు పట్టాలను దాటే క్రమంలో గుర్తుతెలియని రైలు ఢీకొని మృతి చెందాడు. ఘటనపై మంచిర్యాల రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.
అనారోగ్యంతో వృద్ధుడు ఆత్మహత్య
తలమడుగు: అనారోగ్యంతో వృద్ధుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తలమడుగు మండలంలోని ఉండం గ్రామానికి చెందిన ఎండీ ఖాసీం (60) కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆస్పత్రిలో చికిత్స చేయించినా నయం కాకపోవడంతో మనస్తాపం చెందాడు. ఆదివారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై రాధిక తెలిపారు.


