కృష్ణం వందే జగద్గురుమ్‌ | - | Sakshi
Sakshi News home page

కృష్ణం వందే జగద్గురుమ్‌

Sep 4 2026 11:50 PM | Updated on Sep 4 2026 11:50 PM

వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

నెల్లూరు(బృందావనం): మినీబైపాస్‌ రోడ్డు సమీపంలోని ఇస్కాన్‌ సిటీలోని అంతర్జాతీయ శ్రీకృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్‌) మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు శుక్రవారం వైభవంగా నిర్వహించారు. రాధాకృష్ణులకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. మందిరంలో వేంచేసి ఉన్న జగన్నాథ, సుభద్ర, బలరాములు ప్రత్యేకాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. బాలకృష్ణుడికి ఊంజల్‌ సేవను భక్తులు ఆనందోత్సాహాలతో నిర్వహించారు. భజనలు, కీర్తనలతో మందిరం ఆధ్యాత్మిక చింతనతో మార్మోగింది. ఇటీవల నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన బాలలకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. మధ్యాహ్నం స్మారికను ఆవిష్కరించారు. సంప్రదాయంగా అర్ధరాత్రి శ్రీకృష్ణ భగవానుడికి అభిషేక మహోత్సవాన్ని నిర్వహించారు.

భగవద్గీతను ప్రతి ఒక్కరూ చదవాలి

శ్రీకృష్ణుడు దేవదేవుడని, ఆయన చెప్పిన శ్రీమద్భగవద్గీతను ప్రతి ఒక్కరూ చదవాలని ఇస్కాన్‌ మందిర అధ్యక్షుడు డాక్టర్‌ శుకదేవస్వామి తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతనతో దైవానుగ్రహం కలుగుతుందన్నారు. సనాతన ధర్మం, మానవత్వం నాలుగు కాలాలపాటు మనగలగాలంటే జీవితానికి ఆధ్యాత్మిక చింతన ఎంతో అవసరమన్నారు. అంతర్జాతీయ శ్రీకృష్ణ చైతన్య సంఘం వ్యవస్థాపకులు, శ్రీకృష్ణ తత్వాన్ని విశ్వవ్యాప్తం చేసిన శ్రీల ప్రభుపాద వ్యాసపూజ శనివారం ఉదయం జరుగుతుందని తెలిపారు. మధ్యాహ్నం హారతి, శ్రీల ప్రభుపాద పుష్పాంజలి, నందోత్సవం జరుగుతాయన్నారు.

శివకేశవుల దేవస్థానంలో..

దర్గామిట్ట క్రాంతినగర్‌ కొండాబలరామిరెడ్డి వీధిలోని శివకేశవుల దేవస్థానంలో 40వ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. సాయంత్రం బాలబాలికలు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలతో కనువిందు చేశారు. ఉట్టి మహోత్సవం వేడుకగా సాగింది. దీనికి దాతలుగా జలకం మనోహర్‌బాబు, సుజాత, రాచపూడి మధుజయ వ్యవహరించారు. ముఖ్యఅతిథులుగా విశ్వహిందూ పరిషత్‌ నేతలు మోడెం మల్లికార్జునరావు, ఏవీఆర్‌ రాజేంద్రప్రసాద్‌, విభాగ్‌ మాతృశక్తి సంయోజక్‌ అన్నపూర్ణ, బట్టేపాటి హరిప్రసాద్‌రెడ్డి, తాటిపర్తి బాలాజీ, మునిరాజ్‌, లోకనాథం తదితరులు విచ్చేశారు. శనివారం సాయంత్రం రుక్మిణీదేవి, జాంబవతి దేవి సమేత వేణుగోపాలస్వామి కల్యాణ మహోత్సవం జరుగుతుందని ట్రస్ట్‌ చైర్మన్‌ దర్శిగుంట పెంచలయ్య తెలిపారు. కార్యక్రమంలో దేవస్థాన ట్రస్ట్‌ సభ్యులు గోవిందు, శేఖర్‌బాబు, విజయ్‌చంద్ర, నరసయ్యస్వామి, బి.స్వామి, సూర్యప్రకాష్‌, సాయి, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.

● బాలాజీనగర్‌ పిండిమిల్లు సెంటర్‌ శ్రీకృష్ణాష్టమి ఉట్టి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. చిరంజీవి సేవా సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో బాలాజీ నగర్‌ యూత్‌, స్థానిక పెద్దల సహకారాలతో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఉదయం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తుల కోలాట ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఇంకా కొండ్రెడ్డి రంగారెడ్డి తదితరులు పాల్గొనగా నిర్వాహకులు సత్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement