నాగులుప్పలపాడు (మద్దిపాడు): ఎల్‌నినో ప్రభావం అధికంగా ఉన్న నేపథ్యంలో పాడి పశువులకు మేత కొరత రాకుండా పీఎండీఎస్ పద్ధతిని ఉపయోగించి పశుగ్రాసాన్ని సమకూర్చుకునే విధానంపై బీ నిడమానూరు గ్రామ రైతు సేవా కేంద్రంలో పశుపోషకులకు గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నాగులుప్పలపాడు ఏడీ పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోతవరం పొలాల్లో ఏర్పాటు చేసిన క్షేత్రస్థాయి పరిశీలనకు జిల్లా పశుసంవర్థకశాఖ పబ్లిసిటీ విస్తరణ విభాగం ఉపసంచాలకులు డాక్టర్ టీఆర్‌కే ప్రసాద్, సంయుక్త సంచాలకులు డాక్టర్ బీ రవికుమార్, ఉప సంచాలకులు డాక్టర్ చినవెంకటరెడ్డి హాజరై మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావం వలన పశుగ్రాసం కొరత ఏర్పడకుండా పీఎండీఎస్ పద్ధతి ద్వారా పంటలు వేయడం వలన రసాయనిక ఎరువుల వాడకం తగ్గుతుందని, పురుగు మందుల ఖర్చులేకుండా తక్కువ ఖర్చుతో పశుగ్రాసం సాగుచేయవచ్చని తెలిపారు. కార్యక్రమంలో నాగులుప్పలపాడు వ్యవసాయాధికారి, ఉప్పుగుండూరు పశు వైద్యశాల డాక్టర్ కృష్ణవేణి, పశువైద్య శాఖ సిబ్బంది, రైతు సేవా కేంద్రం సిబ్బంది, పశుపోషకులు పాల్గొన్నారు.


