ఒంగోలు సబర్బన్: జిల్లాలో ప్రత్యేక ఆధార్ నమోదు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు (ఎస్‌జీఎస్‌డబ్ల్యూ) నోడల్ అధికారి ఎం వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మున్సిపల్ పాఠశాలల్లో గురువారం ఆధార్ ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల, పీవీఆర్ బాలికల ఉన్నత పాఠశాలల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆధార్ నమోదు కేంద్రాలను తనిఖీ చేశారు. ప్రత్యేక ఆధార్ నమోదు, అప్‌డేట్ శిబిరాలు పని చేస్తున్న తీరును ఆయన పరిశీలించారు. మొదటి విడతలో 11వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఈ ప్రత్యేక క్యాంపులు ఉంటాయన్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో ఆధార్‌లేని వారికి ప్రత్యేకంగా నమోదు, అప్‌డేట్ సేవలు అందేలా చర్యలు చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు ఉన్నారు.


