ఒంగోలు టౌన్: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక పాలనను నిరసిస్తూ, దళితలు, గిరిజనులు, రైతులు, కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ దేశ రాజధాని ఢీల్లీలోని రాంలీలా మైదానం వద్ద చేపట్టిన నిరసనలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సీపీఐ నగర కార్యదర్శి శ్రీరాం శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. చలో ఢిల్లీ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 5వ తేది నుంచి 15వ తేదీ వరకు నిర్వహిస్తున్న ప్రచార యాత్రలో భాగంగా గురువారం ఒంగోలు నగరంలో ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కార్యవర్గ సభ్యులు కె.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, విద్యా వైద్యాన్ని పేదలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. బ్యాలెట్ పేపర్ విధానంలోనే ఎన్నికలు నిర్వహించాలని కోరారు. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం పోరాటాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సీపీఐ సీనియర్ నాయకుడు ఉప్పుటూరి ప్రకాశరావు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటి వరకు నెరవేర్చకపోవడం దారుణమన్నారు. రెండేళ్లు గడుస్తున్నా ఒంగోలు నగరంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని, ఒక్కొక్కరికి రెండు సెంట్ల చొప్పున ఇస్తామని చెప్పిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సయ్యద్ సర్దార్, సీహెచ్ వెంకటేశ్వర్లు, ముత్తన అంజయ్య, కై లా అజయ్, బోడపాటి సుబ్బారావు, నల్లూరి మురళి పాల్గొన్నారు.


