ఆదిలాబాద్: జిల్లాలో ఆర్టీసీ తీరు విమర్శలకు తావిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా అధికారులు ఆయా బస్సుల బోర్డులు మారుస్తూ ప్రయాణికుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. ఆర్డినరీ సర్వీసులకు ఎక్స్‌ప్రెస్ బోర్డులు తగిలించి అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారు. ఈ మేరకు ఆ శాఖ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నిబంధనలు తుంగలో తొక్కుతూ..
పల్లె వెలుగు బస్సులను ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలకు నడుపుతుంటారు. ఇవి ప్రతి రిక్వెస్ట్ స్టాప్ వద్ద ఆగుతూ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తుంటాయి. ఎక్స్‌ప్రెస్‌తో పోలిస్తే వీటి చార్జీలు తక్కువ. అలాగే సీట్ల సౌకర్యం, వేగం విషయంలోనూ బేధం ఉంటుంది. అయితే ప్రస్తుతం అధికారులు ఈ బస్సులకు ఎక్స్‌ప్రెస్ బోర్డు తగిలించి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు. అధికారుల తీరుతో అదనపు భారం పడుతోందని ప్రయాణికులు పేర్కొంటున్నారు.
గ్రామాలకు తగ్గుతున్న బస్సులు..
గ్రామీణ ప్రాంతాలకు నడిచే పల్లె వెలుగు కంటే హైఎండ్ బస్సుల ద్వారా ఆర్టీసీకి ఆదాయం అధికంగా వస్తుంది. నిత్యం రద్దీగా ఉండే పట్టణ మార్గాల్లో ప్రతి 15 నుంచి 30 నిమిషాలకోసారి బస్సులను ఆపరేట్ చేస్తుంటారు. అయితే ఎన్ని నడిపినా ట్రాఫిక్ తగ్గడం లేదని భావించిన అధికారులు బిజీ రూట్లలో తిరిగే ఆర్డినరీ సర్వీసులకు ఎక్స్‌ప్రెస్ బోర్డు తగిలిస్తున్నారు. తద్వారా పల్లె వెలుగు సర్వీసుల సంఖ్య తగ్గి గ్రామీణ ప్రాంత ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో తమ గ్రామాలకు రోజుకు రెండు, మూడు ట్రిప్పులు నడిచిన బస్సులు ప్రస్తుతం ఒక్క ట్రిప్పుకే పరిమితమైనట్లు పేర్కొంటున్నారు. ఫలితంగా బస్సు కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధిక చార్జీల భారమిలా..
జిల్లా కేంద్రం నుంచి బేలకు ప్రతిరోజూ వందలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ రూట్‌లో పల్లె వెలుగులో రూ.40 చార్జీ ఉండగా, ప్రస్తుతం ఎక్స్‌ప్రెస్ పేరిట ఈ సర్వీసులకే రూ.50 వసూలు చేస్తుండడం గమనార్హం. ఇలా ఒక్కో ప్రయాణికుడిపై రూ.10 భారం పడుతోంది. ఈ క్రమంలో అధికారుల తీరుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


