ఆదిలాబాద్‌టౌన్: భూసమస్యలకు శాశ్వత పరిష్కా రం చూపడంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా భూరీసర్వేను అత్యంత ప్రాధాన్యంతో చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ, సమాచార పౌర సంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఖమ్మం సమీకృత కలెక్టరేట్ నుంచి భూరీసర్వే, భూభారతి అమలు, సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారం, ఇందిరమ్మ ఇళ్లు, విద్యార్థు ల యూనిఫాంల పంపిణీ తదితర అంశాలపై ఆయా జిల్లాల కలెక్టర్లతో మంత్రి శనివారం వీడి యో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హైదరాబాద్ నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డీఎస్ లోకేష్ కుమార్ పాల్గొనగా.. ఆదిలాబాద్ కలెక్టరేట్ నుంచి కలెక్టర్ రాజర్షి షా పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ధరణి స్థానంలో భూభారతి చట్టాన్ని తీసుకువచ్చి రైతుల భూములకు పూర్తి భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇందులో భాగంగా రెగ్యులర్, లైసెన్స్‌డ్ సర్వేయర్లు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. తొలి విడతలో ప్రతి జిల్లాలో 70 గ్రామాలను ఎంపిక చేసి రీసర్వే చేపడుతున్నామని పేర్కొన్నారు. ఇందులో అదనపు కలెక్టర్ ఆర్‌ఎస్ చిత్రు, ఆర్డీవో జగదీశ్వర్ రావు, ఉట్నూర్ ఆర్డీవో మోహన్‌సింగ్, ఏవో వర్ణ తదితర అధికారులు పాల్గొన్నారు.
క్రీడలను మరింత ప్రోత్సహించేందుకే శిక్షణ
ఆదిలాబాద్: క్రీడలను మరింతగా ప్రోత్సహించేందుకే ‘స్పోర్ట్స్ నాలెడ్జ్ ఆన్ వీల్స్’ శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు సాట్జీ స్విమ్మింగ్ కోచ్ సంతోష్‌చారి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో క్రీడలపై ఆసక్తి పెంపొందించడమే కాకుండా వారిలో మనోధైర్యం నింపేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందన్నారు. డీవైఎస్‌ఓ దయానంద రెడ్డి మాట్లాడుతూ చిన్నారుల శారీరక, మానసిక వికాసానికి క్రీడలు ఎంతో అవసరమన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ శిక్షకులు సునంద, జ్యోతిశ్వర్, డీటీఎస్‌వో పార్థసారథి, స్పోర్ట్స్ స్కూల్ ప్రిన్సిపాల్ భూమన్న, ఎస్జీఎఫ్ సెక్రటరీ రామేశ్వర్, తెలంగాణ పీడీ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కాంతారావు, స్వామి, తదితరులు పాల్గొన్నారు.


