ట్రాన్స్‌‘ఫార్మర్‌’పై ఓవర్‌లోడ్‌! | - | Sakshi
Sakshi News home page

ట్రాన్స్‌‘ఫార్మర్‌’పై ఓవర్‌లోడ్‌!

Mar 18 2026 8:09 AM | Updated on Mar 18 2026 8:09 AM

● అనధికార కనెక్షన్లు.. తరచూ పాడవుతున్న నియంత్రికలు ● విద్యుత్‌ సరఫరాలో అంతరాయం.. పంటలకు నీరందని వైనం

బోథ్‌: జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ విద్యుత్‌ సరఫ రాపై రోజురోజుకు భారం పెరుగుతోంది. ముఖ్యంగా అనధికారిక కనెక్షన్లు అధికమవడం, అనుమతించిన సామర్థ్యాన్ని మించి మోటార్లు వినియోగించడం వల్ల ట్రాన్స్‌ఫార్మర్లు (డీటీఆర్లు) తరచూ కాలిపోతున్న పరిస్థితి. ప్రభుత్వం వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ అందిస్తున్న నేపథ్యంలో కొంతమంది రైతులు నిబంధనలు పాటించకుండా అక్రమంగా కనెక్షన్లు తీసుకుంటున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. జిల్లాలో సుమారు ఐదు వేల వరకు ఇలాంటి కనెక్షన్లు ఉన్నట్లుగా తెలుస్తోంది.

7 హెచ్‌పీ మోటార్ల వినియోగం..

అనుమతులు 5 హెచ్‌పీ మోటార్లకు తీసుకుని, వాటి స్థానంలో 7 హెచ్‌పీ లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం గల వాటిని నడపడం విస్తృతంగా జరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో 25కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌పై ఆరు వరకు మాత్రమే వినియోగించాల్సి ఉండగా మరో ఐదారు వరకు అదనంగా నడుస్తున్నట్లుగా విద్యుత్‌ అఽధికారులు పేర్కొంటున్నారు. ఈ పరిణామాల వల్ల అనూహ్యంగా లోడ్‌ పెరిగి ట్రాన్స్‌ఫార్మర్లు తరచూ దెబ్బతింటున్నాయి.

ఇబ్బందులు పడుతున్న రైతులు..

ట్రాన్స్‌ఫార్మర్లు చెడిపోవడంతో అధికారికంగా కనెక్షన్లు ఉన్న రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అనధికారికంగా వినియోగిస్తున్న వారు రైతులే కావడతో వారిని ఏమి అనలేకపోతున్నామని పలువురు పేర్కొటున్నారు. విద్యుత్‌ అధికారులే సర్వే చేసి అనధికార కనెక్షన్లు తొలగించాలని వారు కోరుతున్నారు.

జిల్లాలో మొత్తం విద్యుత్‌ కనెక్షన్లు : 2.87 లక్షలు

అధికారికంగా కనెక్షన్‌ తీసుకోవాలి

రైతులు అనధికారికంగా విద్యుత్‌ వాడకూడదు. దీంతో ట్రాన్స్‌ఫార్మర్లపై లోడు పెరిగి పాడయ్యే అవకాశం ఉంటుంది. సంబంధిత డీడీ చెల్లించి అధికారికంగా వినియోగించుకోవాలి. అవసరమైతే కెపాసిటీ పెంచి సరిపడా అందించే చర్యలు చేపడతాం.

– లక్ష్మణ్‌, ఏడీఈ, విద్యుత్‌శాఖ

బోథ్‌ మండలంలోని ఓ గ్రామ శివారులో 63 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌ ఉంది. దీని పరిధిలో గరిష్టంగా 10 వరకు 5హెచ్‌పీ మోటార్లు పనిచేసే వీలుంది. అయితే అక్రమంగా మరో ఐదారు కనెక్షన్లు ఉన్నాయి. ఈ క్రమంలో ట్రాన్స్‌ఫార్మర్‌పై లోడు పెరిగి ఇటీవల చెడిపోయింది. విద్యుత్‌శాఖ అధికారులు దానిని బాగు చేసేందుకు వారం పట్టింది. ఈ సమయంలో రైతులు పంటలకు నీరందించేందుకు ఇబ్బందులు పడ్డారు. ఇదొక్క చోటే కాదు.. జిల్లాలో చాలా ప్రాంతాల్లో అనధికార కనెక్షన్లతో రైతులకు ఇబ్బందులు తప్పని పరిస్థితి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement