సిరికొండ: నాటు వైద్యం నమ్మొద్దని, ఎలాంటి అనా రోగ్య సమస్యలైనా వైద్యులను సంప్రదించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మండలంలోని కుంటగూడ పంచాయతీ పరిధి పాలవాగు గ్రామంలో మంగళవారం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ఎస్పీ హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్కరూ మూఢ నమ్మకాలు వీడాలన్నారు. యువత చదువుపై దృష్టి సారించి ఉన్నతంగా ఎదగాలని సూచించారు. అనంతరం ఆదిలాబాద్ నుంచి విచ్చేసిన ప్రైవేట్ వైద్యులు సుమారు 100 మందికి వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. ఇందులో ఉట్నుర్ ఏఎస్పీ రుత్విక్ సాయి, ఇచ్చోడ సీఐ రమేశ్, స్థానిక ఎస్సై పూజ, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.
రంజాన్ క్రమశిక్షణకు ప్రతీక
ఆదిలాబాద్‌టౌన్: రంజాన్ మాసం క్రమశిక్షణకు, దాతృత్వానికి నిదర్శనమని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఏఆర్ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ముస్లిం పోలీస్ సిబ్బంది కోసం మంగళవారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు వ్యవస్థలో మతసామరస్యాన్ని పెంపొందించేలా పండుగలను నిర్వహించుకోవడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు బి.సురేందర్‌రావు, పి. మౌనిక, శిక్షణ ఐపీఎస్ రాహుల్‌కాంత్, డీఎస్పీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.


