ఆదిలాబాద్‌టౌన్: వంట గ్యాస్ విషయంలో సోషల్ మీడియాలో వచ్చే వదంతులు ప్రజలు నమ్మవద్దని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. పట్టణంలోని విమల్ గ్యాస్ ఏజెన్సీని శనివారం పరిశీలించారు. నిర్వాహకులతో మాట్లాడి స్టాక్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆన్‌లైన్ బుకింగ్, ఇతర అంశాలపై పలు సూచనలు చేశారు. వంట గ్యాస్‌ను అక్రమంగా, అధిక ధరలకు విక్రయించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అన్ని శాఖల సమన్వయంతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే టోల్‌ఫ్రీ నం.18004251939పై సంప్రదించాలని సూచించారు. ఆయన వెంట ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి, వన్‌టౌన్ ఎస్సై సునిల్ కుమార్, సిబ్బంది తదితరులు ఉన్నారు.
రంజాన్ క్రమశిక్షణ, దాతృత్వానికి ప్రతీక
ఆదిలాబాద్: రంజాన్ మాసం క్రమశిక్షణకు, దాతృత్వానికి ప్రతీక అని ఎస్పీ అఖిల్ మహా జన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఖిజార మసీద్‌లో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌లో ఆయన పాల్గొన్నారు. పవిత్ర మాసంలో నిరుపేదలకు అండగా నిలబడటం అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమంలో మసీద్ కమిటీ సభ్యులు, పలువురు ముస్లిం పెద్దలు పాల్గొన్నారు.


