నిర్మల్‌చైన్‌గేట్: ఆరు నెలలుగా సరైన విధి విధానాలు లేక లైసెన్స్‌డ్ సర్వేయర్ల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని, తమ సమస్యలను అసెంబ్లీలో చర్చించి, పనికి తగిన వేతనం అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని జిల్లా లైసెన్స్‌డ్ సర్వేయర్ల కమిటీ తరఫున ఎమ్మెల్యే, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డికి శనివారం వినతిపత్రం ఇచ్చారు. రాష్ట్రస్థాయిలో మొత్తం 6,500 మంది సర్వేయర్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యామని, స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా లైసెన్స్‌లను పొంది దాదాపు 3,500 మంది అభ్యర్థులకు, మండలాలు కేటాయించారని తెలిపారు. సొంత డబ్బులు పెట్టుకుని విధులకు హాజరవుతున్నామన్నారు. మండల కార్యాలయాల్లో ఎటువంటి పని కల్పించడం లేదన్నారు. ఉన్న ఉద్యోగాలు వదులుకుని, లైసెన్స్ సర్వేయర్లుగా పనిచేస్తున్నామని, ప్రభుత్వం నుండి సరైన విధి విధానాలు లేక ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలలోపు ప్రభుత్వం సర్వేయర్లపై తన వైఖరిని ప్రకటించాలని లేనిపక్షంలో లైసెన్సుడ్ సర్వేయర్ల తరఫున అసెంబ్లీలో పోరాడుతామన్నారు.
చెక్‌బౌన్స్ కేసులో ఒకరికి ఏడాది జైలు
మంచిర్యాలక్రైం: చెక్‌బౌన్స్ కేసులో ఒకరికి ఏడాది జైలుశిక్షతో పాటు తీసుకున్న మొత్తం చెల్లించాలని జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి నిరోష శనివారం తీర్పు వెలువరించారు. మాజీమంత్రి బోడ జనార్దన్ ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా బాలయ్యపల్లెకు చెందిన రమేశ్ చౌదరి అనే వ్యక్తికి వ్యాపార నిమిత్తం రూ.7లక్షలు అప్పుగా ఇచ్చారు. తిరిగి చెల్లించక పోవడంతో అతను ఇచ్చిన చెక్కును బ్యాంకులో డిపాజిట్ చేశారు. చెక్కు బౌన్స్ కావడంతో జనార్దన్ న్యాయం కోసం 2025లో కోర్టును ఆశ్రయించారు. అతని తరపు న్యాయవాది చిరంజీవి న్యాయమూర్తి ఎదుట వాదనలు వినిపించారు. సాక్ష్యాలను పరిశీలించిన న్యాయమూర్తి నిందితునికి ఏడాది జైలుశిక్షతో పాటు తీసుకున్న అప్పు మొత్తాన్ని చెల్లించాలని తీర్పునిచ్చారు.


