భైంసా: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి కళ్యాణోత్సవానికి సంబంధించిన తలంబ్రాలు, ప్రసాదాలు భక్తులకు సులభంగా అందించేలా పోస్టల్ శాఖ ప్రత్యేక సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. భద్రాచలం దేవస్థానం నుంచి పంపించే తలంబ్రాలు, ప్రసాదాలను పోస్టల్ శాఖ భక్తుల ఇళ్లకు చేరవేసే ఏర్పాట్లు చేశారు. ఇందులోభాగంగా భైంసాలో శనివారం ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేసి పోస్టల్ అధికారులు ప్రసాదాలు బుక్ చేశారు. ఈ సందర్భంగా పోస్టల్ సబ్ ఇన్‌స్పెక్టర్ దిలీప్‌కుమార్ మాట్లాడుతూ భక్తులు పోస్టాఫీసుల ద్వారా తలంబ్రాలు, ప్రసాదాలను బుక్ చేసుకుని ఇంటి వద్దే పొందవచ్చని తెలిపారు. భక్తులు భద్రాచలం వెళ్లలేని పరిస్థితుల్లో ఈ సేవల ద్వారా సులభంగా తలంబ్రాలు అందుకుంటారని చెప్పారు. ఇప్పటి వరకు భైంసా సబ్ డివిజన్ పరిధిలో 540కిపైగా ప్రసాదాలు బుక్ అయ్యాయని పేర్కొన్నారు. ఈనెల 20 వరకు అన్ని పోస్టాఫీసుల్లో ఈ సేవలను భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. భైంసా సబ్ డివిజన్ పరిధిలోని అన్ని పోస్టాఫీసుల్లో ఈ బుకింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. భక్తులు ముందుగా బుక్ చేసుకుంటే తలంబ్రాలు ప్రసాదాలు పోస్టల్ శాఖ భద్రంగా వారి చిరునామాలకు చేరవేస్తుంది చెప్పారు. కార్యక్రమంలో పోస్టల్ అసిస్టెంట్ సీహెచ్.వినోద్‌కుమార్, పోస్టల్ ఎంవో డి.నరేష్‌కుమార్, బీపీఎంలు, ఏబీపీఎంలు పాల్గొన్నారు.


