రామకృష్ణాపూర్: రామకృష్ణాపూర్ ఓపెన్‌కాస్ట్ ఫేజ్–2 గని అంశంపై రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి శుక్రవారం మందమర్రి ఏరియా జీఎం రాధాకృష్ణతో సమీక్షించారు. గద్దెరాగిడిలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి అనంతరం ఓసీ ఫేజ్–2పై జీఎంతో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఓసీ విస్తరణలో భాగంగా ఫేజ్–2 మైన్‌కు అనుమతులు లభించాయని, అయితే గనికి అవసరమైన భూమికి ఇంకా ఫారెస్ట్ క్లియరెన్స్ రావాల్సి ఉందన్నారు. గనికి కేటాయించాల్సిన భూమి నాన్ ఫారెస్ట్ ప్రాంతంలో ఉన్నప్పటికీ కొందరు అధికారులు దాన్ని రిజర్వ్ ఫారెస్ట్‌గా పేర్కొంటున్నారని అన్నారు. ఇప్పటికే క్లియరెన్స్ కోసం డీఎఫ్‌ఓ సహా సంబంధిత అధికారులతో మాట్లాడి అనుమతులు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. కొత్త గని అందుబాటులోకి వస్తే సుమారు 18 ఏళ్లపాటు బొగ్గు ఉత్పత్తి కొనసాగడంతోపాటు స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కొత్త గనుల కోసం నిర్వహించిన వేలంలో పాల్గొనకుండా అడ్డుకుందని విమర్శించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్‌రెడ్డి, పల్లెరాజు, గాండ్ల సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.


