పీల్చే ప్రతీ దమ్ము.. మృత్యువుకు వేసే అడుగు నేడు ‘జాతీయ ధూమపాన నిరోధక దినం’
కాలిపోతున్న సంసారాలు..
అనాథలవుతున్న పిల్లలు
ధూమపానం కేవలం వ్యక్తిగత సమస్య కాదు.. అది ఒక సామాజిక విపత్తుగా మారుతోంది. ఇంటి యజమాని క్యాన్సర్ బారినపడితే ఆ కుటుంబం ఆర్థికంగా కుప్పకూలిపోతోంది. వైద్యం కోసం ఉన్న ఆస్తిపాస్తులు అమ్ముకుని, చివరకు దిక్కులేని వారవుతున్న కుటుంబాలు జిల్లాలో ఎన్నో ఉన్నాయి. పొగతాగడం ద్వారా కేవలం ఆరోగ్యాన్నే కాదు, పిల్లల భవిష్యత్తును కూడా కాల్చేస్తున్నారని సామాజిక కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ధృడ సంకల్పమే మందు..
ధూమపానం మానేయడం అసాధ్యమేమీ కాదని, అది మనసు తీసుకునే ఒకే ఒక్క నిర్ణయం మీ ద ఆధారపడి ఉంటుందని వైద్యులు పేర్కొంటున్నారు. సిగరేట్ మానేసిన 20 నిమిషాల్లోనే రక్తపోటు సాధారణ స్థితికి వస్తుందని, ఏడాది తిరిగేసరికి గుండెజబ్బుల ముప్పు సగానికి తగ్గుతుందని పేర్కొంటున్నారు.
ఆ ఒక్క దమ్ములో అంతులేని ఆనందం
ఉందని భ్రమిస్తారు. అది కేవలం పొగ కాదు..జీవితాన్ని బుగ్గి చేసే మంట. అది కేవలం అలవాటు కాదు.. మనిషిని నిలువునా దహించే వ్యసనం. అందులో మృత్యువు దాగి ఉందన్న నిజాన్ని మర్చిపోతున్నారు. ‘పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం’అని సిగరేట్ పెట్టెలపై బొమ్మలు వేసి మరీ హెచ్చరిస్తున్నా.. ధూమపాన ప్రియుల్లో మార్పు రావడం లేదు. ఏటా మార్చి రెండో బుధవారం నిర్వహించే ‘జాతీయ ధూమపాన నిరోధక దినోత్సవం’సందర్భంగా కథనం.
– బోథ్
ధూమపానం వల్ల కలిగే అనర్థాలు అన్నీఇన్నీ కావు. ఒక్క సిగరేట్ ముక్కలో సుమారు 4 వేలకు పైచిలుకు రసాయనాలు ఉంటాయి. ఇవి ఊపిరితిత్తులను కుళ్లింపజేయడమే కాకుండా, గుండెపోటు, పక్షవాతం, నోటి క్యాన్సర్‌కు ప్రధాన కారకాలుగా మారుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో శ్వాసకోస వ్యాధులతో చేరుతున్న వారిలో సంఖ్య ఎక్కువగా ఉంటోంది.
ధూమపానానికి దూరంగా ఉండాలి
ధూమపానం నేరుగా ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండె జబ్బులకు దారితీస్తుంది. పొగాకులో నికోటిన్ రక్తనాళాలను కుంచించుకుపోయేలా చేసి రక్తపోటు పెంచుతుంది. దీనివల్ల పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంది. శ్వాసకోశ వ్యవస్థ దెబ్బతినడం వల్ల ఆస్తమా, దీర్ఘకాలిక దగ్గు సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్యకరమైన జీవితం కోసం ధూమపానానికి దూరంగా ఉండటం అత్యంత అవసరం. నిరంతరం ప్రాణాయామం చేయడం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. – నవీన్‌రెడ్డి, వైద్యుడు, బోథ్


