ఆదిలాబాద్‌టౌన్: శనగ పంట మధ్యలో అక్రమంగా పండిస్తున్న 420 గంజాయి మొక్కలను గుర్తించి స్వాధీనం చేసుకుని, నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో మంగళవారం ఈ మేరకు వివరాలు వెల్లడించారు. ఇచ్చోడ మండలం హీరాపూర్‌లో ప్రధాన నిందితుడైన సిరికొండ మండలం సోంపల్లికి చెందిన పవర్ మాధవ్ 9 ఎకరాల వ్యవసాయ భూమిలో శనగ సాగు చేస్తున్నాడు. పంట మధ్యలో గంజాయి పండిస్తున్నాడనే సమాచారంతో ఎస్సై రమేశ్ ఆధ్వర్యంలో దాడి చేశారు. నలుగురి వద్ద గంజాయి మొక్కలు లభ్యమయ్యాయి. ప్రధాన నిందితుడు వద్ద 390 గంజాయి మొక్కలు, మిగిలిన ముగ్గురి వద్ద తలా పది గంజాయి మొక్కలు దొరికాయి. మొత్తం 420 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకోగా, వీటి విలువ రూ.42 లక్షల వరకు ఉంటుందని ఎస్పీ వివరించారు. ప్రధాన నిందితుడు పవర్ మాధవ్ ఇచ్చోడకు చెందిన ఆత్రం దత్తాత్రి, షేక్ ముజాయిద్, షేక్ ఆరీఫ్‌లకు గంజాయి తాగడానికి ఇస్తూ, వారితోనే గంజాయిని విక్రయింపజేసి వ్యాపారం నిర్వహిస్తున్నాడని చెప్పారు. జాతీయ రహదారి వద్ద ప్రయాణించే లారీలకు గంజాయిని అమ్మించి, ఆ డబ్బులో నుంచి రూ.500 చొప్పున వారికి ఇస్తూ వారి జల్సాలకు గంజాయి అందించేవాడన్నారు. ఈ నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. ఇప్పటివరకు పంట పొలాల్లో గంజాయి పండించిన 40 మందికి రైతుబంధు సహా ప్రభుత్వ పథకాలు వర్తించకుండా సిఫారసు చేసినట్లు వెల్లడించారు. అనుమానాస్పద వ్యక్తులపై గంజాయి టెస్టింగ్ కిట్ల ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఇప్పటివరకు 30 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. గంజాయి సంబంధిత సమాచారం ఉంటే 8712659973 నంబర్‌కు వాట్సాప్ ద్వారా అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. సమావేశంలో ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే, ఇచ్చోడ సీఐ బండారి రాజు పాల్గొన్నారు.


