ఖానాపూర్: మండలంలోని పాత ఎల్లాపూర్ గ్రామంలో తన భర్త పేరిట ఉన్న వ్యవసాయ భూమిని తన పేరుపై చేయాలని కోరుతూ ఓ మహిళ కుటుంబ సభ్యులతో కలిసి తహసీల్దార్ కార్యాలయం ఎదుట మంగళవారం నిరసన తెలిపింది. పాత ఎల్లాపూర్ గ్రామంలో తన భర్త వెంకటి పేరుమీద 1.20 ఎకరాల వ్యవసాయ భూమి ఉందని పేర్కొంది. తన భర్త కొన్ని సంవత్సరాల క్రితం చనిపోవడంతో ఆ భూమిని తనపేరిట మార్చాలని అధికారులకు విన్నవించినా పట్టింకోవడం లేదని అల్లెపు చిన్నక్క ఆవేదన వ్యక్తం చేసింది. 20 గుంటల భూమిని ఇతరుల పేరు మీద చేసేందుకు రెవెన్యూ అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్టబద్ధంగా తాను అర్హురాలినని, ఎందుకు బదిలీ చేయడం లేదో చెప్పాలని డిమాండ్ చేసింది. భూ రికార్డులు పరిశీలించి తనకు న్యాయం చేయాలని కోరింది. అనంతరం తహసీల్దార్ సుజాతకు వినతిప్రతం అందించారు.


