అనాథలైన చిన్నారులు ఆరు నెలల క్రితమే భర్త మృతి కన్నీరుమున్నీరైన కుటుంబీకులు వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆందోళన
ఆదిలాబాద్‌టౌన్: తల్లిదండ్రుల మృతితో ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. ఇన్నిరోజుల పాటు ఆలనపాలన చూసిన తల్లి కన్నుమూయడంతో మూడేళ్ల బాలుడు ఆమె మృతదేహంపై పడి ఏడ్చిన తీరు కలచివేసింది. రిమ్స్‌లో మంగళవారం తెల్లవారుజామున బాలింత మృతిచెందింది. ఆమె భర్త ఆత్రం విఠల్ ఆరు నెలల క్రితం చనిపోగా, భార్య సైతం మృతితో చిన్నారులు అనాథలుగా మారారు. ప్రసవమైన వారం తర్వాత మృతిచెందడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. వైద్యుల నిర్లక్ష్య కారణంగానే బాలింత మృతిచెందినట్లు ఆరోపించారు. తీవ్ర ఆందోళనకు దిగారు. ఐటీడీఏ, వైద్యారోగ్య శాఖ అధికారులు రిమ్స్‌కు చేరుకుని న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో శాంతించారు. ఇద్దరు పిల్లలను ఆదుకోవాలని కుటుంబీకులు, గిరిజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
అసలేం జరిగిందంటే..
ఉట్నూర్ మండలం లక్కారం పరిధిలోని రాంజీగోండ్ గూడకు చెందిన ఆత్రం గంగుబాయి (25) ఫిబ్రవరి 28న ప్రసవం కోసం రిమ్స్ మెటర్నిటీ వార్డులో చేరింది. అదేరోజు రాత్రి సిజేరియన్ ద్వారా వైద్యులు ప్రసవం చేశారు. అయితే రెండో సంతానంగా మగబిడ్డకు జన్మనిచ్చింది. కుటుంబీకులు, వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 7న శరీరం అంతటా దద్దుర్లు వచ్చాయి. కడుపులో ఇన్ఫెక్షన్ రావడంతో శరీరంపై దద్దుర్లు వచ్చాయి. డెర్మటాలజీ వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత 8న ఆమెకు జ్వరం వచ్చింది. ఆమెకు పోస్టు ఆపరేటీవ్ వార్డుకు మార్చారు. తీవ్ర అస్వస్థత ఉండడంతో హెచ్‌బీయూ వార్డుకు సోమవారం తరలించారు. ఫిజీషియన్ వైద్యులు చికిత్స అందించారు. అక్కడి నుంచి ఎంఐసీయూ వార్డుకు షిఫ్ట్ చేశారు. ఆక్సిజన్ శాతం 70 నుంచి 80 ఉందని, బీపీ 80/60గా నమోదైనట్లు తెలిపారు. శ్వాససరిగా ఆడకపోవడం, గుండె ఆగిపోవడంతో వైద్యులు ఆమెకు సీపీఆర్ చేశారు. మంగళవారం తెల్లవారుజామున ఆమె మృతిచెందినట్లు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు రిమ్స్‌కు చేరుకుని ఆందోళనకు దిగారు. కాగా, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా.. ఆయన అందుబాటులోకి రాలేదు.


