సాత్నాల: నిరుపేద ఆదివాసీ యువకుడి పెళ్లికి చందాలు వేసి జామిని గ్రామస్తులు అండగా నిలిచారు. సాత్నాల మండలంలో ఈ ఘటన జరిగింది. వివరాలు ఇలా.. సాత్నాల మండలం జామిని గ్రామానికి చెందిన కుమ్ర భీమ్రావు–జంగుబాయి దంపతుల కుమారుడు గోద్రూ వివాహం బేల మండలం బోర్గావ్ వధువుతో పెళ్లి నిశ్చయమైంది. ఆదివాసీ, గిరిజన సంప్రదాయ ప్రకారం వరకట్న నిషేధం ఉంది. వరుడి కుటుంబం నిరుపేద కావడం, పెళ్లి ఏర్పాట్లలో డబ్బులు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విషయం తెలుసుకున్న జామిని గ్రామస్తులు చందాలు వేసుకున్నారు. మంగళవారం పెళ్లి సందర్భంగా రూ.31 వేల నగదు అందించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పెందూరు ఇస్తారి మాట్లాడుతూ మా సంప్రదాయంలో వరకట్న నిషేధం ఉండడంతో పెళ్లి ఖర్చులన్నీ వరుడు భరించాల్సి ఉంటుందన్నారు. వరుడి ఆర్థిక స్థితి అంతంత మాత్రమే ఉందని గ్రహించి గ్రామస్తులు ఒక్కటై కుటుంబంగా ఉండి మాకు తోచిన సాయం అందించామన్నారు. గ్రామపెద్ద మహాజన్ కృష్ణ, దేవారి, సర్మోడి తదితరులు పాల్గొన్నారు.


