తోసుకున్న బీజేపీ, కూటమి కౌన్సిలర్లు గల్లాలు పట్టుకుని లాగుతూ గలాటా ఆందోళనకు దిగిన బీజేపీ కౌన్సిలర్లు ఖాళీ బిందెలతో నిరసన తెలిపిన వైనం రసాభాసగా మున్సిపల్ సమావేశం
కై లాస్‌నగర్: ఆదిలాబాద్ మున్సిపల్ కౌన్సిల్ తొలి సమావేశమే రచ్చకు దారి తీసింది. బీజేపీ, కూటమి (కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం) కౌన్సిలర్లు పరస్పరం దూషించుకుంటూ గల్లాలు పట్టుకుని బాహాబాహీకి దిగడం తీవ్ర కలకలం రేపింది. ఆయా పార్టీల నాయకులూ అక్కడికి చేరుకోగా అరుపులు, కేకలు, బొబ్బలతో కార్యాలయం దద్దరిల్లింది. చైర్‌పర్సన్‌కు వ్యతిరేకంగా బీజేపీ కౌన్సిలర్లు మూడున్నర గంటల పాటు ఆమె ఛాంబర్ ఎదుట బైఠాయించి నిరసనకు దిగడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఆందోళన విరమింపజేసేందుకు ప్రయత్నించిన పోలీసులతో బీజేపీ కౌన్సిలర్లు తీవ్ర వాగ్వాదానికి దిగారు. పరస్పరం నెట్టుకున్నారు. దీంతో ఆందోళన తీవ్రతరమైంది. డీఎస్పీ జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీస్ రక్షణ వలయంలో చైర్‌పర్సన్‌ను బయటకు తరలించడంతో వివాదం సద్దుమణిగింది.
అసలేం జరిగిందంటే..
మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష అధ్యక్షతన ఉదయం 11గంటలకు సమావేశం ప్రారంభమైంది. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ హాజరయ్యా రు. తొలుత 49వ వార్డు కౌన్సిలర్ వెనుగంటి ప్రకాశ్‌తో కమిషనర్ రాజు ప్రమాణాస్వీకారం చేయించారు. అనంతరం కౌన్సిలర్లంతా స భకు పరిచయం చేసుకున్నారు. ఎమ్మెల్యే, చైర్‌పర్సన్ సభనుద్దేశించి మాట్లాడిన తర్వాత ఆరు అంశాలతో కూడిన ఎ జెండాను మున్సిపల్ సిబ్బంది వి నిపించారు. ఐదు అంశాలు పూ ర్తయిన తర్వాత వైస్ చైర్మన్ రోహిత్ ప్రార్థనలకు సమయమవుతుందని చెప్పగా కూటమి కౌన్సిలర్లు ఎజెండా పాస్ అనడంతో చైర్‌పర్సన్, కూటమి కౌన్సిలర్లు బయటకు వెళ్లిపోయారు.
చైర్‌పర్సన్ ఛాంబర్ ఎదుట ఆందోళన
సమావేశ మందిరం నుంచి బయటకు వస్తూ చైర్‌పర్సన్ ఛాంబర్‌లోకి వెళ్లే క్రమంలో చైర్‌పర్సన్ భర్త సతీశ్‌తోపాటు కూటమి కౌన్సిలర్లు, బీజేపీ కౌన్సిలర్లు పరస్పరం వాగ్వాదానికి దిగారు. పరుష పదజాలంతో దూషించుకుంటూ బాహాబాహీకి దిగారు. పలువురు కౌన్సిలర్లు తమతమ కౌన్సిలర్లను వారించడంతో కూటమి కౌన్సిలర్లు చైర్‌పర్సన్ ఛాంబర్‌లోకి వెళ్లిపోయారు. చైర్‌పర్సన్ వైఖరిని నిరసిస్తూ బీజేపీ కౌన్సిలర్లు ఆమె ఛాంబర్ ఎదుట ఆందోళనకు దిగారు. లోనికి వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే తనయుడు పాయల్ శరత్, బీజేపీ మహిళా కౌన్సిలర్ల భర్తలు అక్కడకు చేరుకున్నారు. చైర్‌పర్సన్ బయటకు రావాలంటూ అరుపులు, కేకలు, బొబ్బలతో హోరెత్తించారు. ఛాంబర్‌లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో పోలీస్ అధికారులు, వా రికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కాగా, నీటి సమస్య తీర్చాలంటూ బీజేపీ కౌన్సిలర్లు ఖాళీ బిందెలు, బకెట్లతో రెండు గంటల పాటు బైఠాయించి నిరసన కొనసాగించారు. చైర్‌పర్సన్‌కు వ్యతిరేకంగా నినదించారు. డీఎస్పీ జీవన్‌రెడ్డి అక్కడకు చేరుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ససేమిరా అన్నారు. దీంతో ప్రత్యేక పోలీస్ బలగాలను రప్పించి ప్రత్యేక రక్షణ వలయం మధ్య చైర్‌పర్సన్‌తో పాటు కూటమి కౌన్సిలర్లను బయటకు పంపించారు. అనంతరం బీజేపీ కౌన్సిలర్లు కూడా ఆందోళన విరమించి బయటకు వెళ్లడంతో గొడవ సద్దుమణిగింది.
కౌన్సిలర్లు రాజకీయాలతీతంగా పట్టణాన్ని అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు. మరో 300 మంది పారిశుద్ధ్య కార్మికులను నియామకానికి తీర్మానం చేసి ఇస్తే ప్రభుత్వం నుంచి మంజూరయ్యేలా చూస్తానని చెప్పారు. ఎయిర్‌పోర్టు నిర్మాణానికి త్వరలోనే ప్రధాని, సీఎం చేతుల మీదుగా భూమిపూజ ఉంటుందని తెలిపారు. ఇండస్ట్రియల్ కారిడార్ కూడా ఏర్పాటువుతుందని పేర్కొన్నారు. సభ్యులంతా భేషజాలకు పోకుండా ఐదేళ్లు ప్రజల్లో మంచిపేరు తెచ్చుకునేలా పనిచేయాలని సూచించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష మాట్లాడుతూ.. పట్టణంలోని 49 వార్డులను తన సొంత వార్డులుగా అభివృద్ధికి చేసేందుకు నిర్ణయించుకున్నట్లు తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన మొదట బీజేపీ కౌన్సిలర్ వార్డునే సందర్శించి అక్కడి సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించానని చెప్పారు. 99రోజుల కార్యాచరణ ప్రణాళికనూ బీజేపీ కౌన్సిలర్ వార్డు నుంచే మొదలు పెట్టామని, కానీ, ఆ పార్టీ కౌన్సిలర్లు ఉద్దేశపూర్వకంగా రాజకీయం చేస్తూ ఆందోళనకు దిగడం సరికాదని పేర్కొన్నారు.


