సాక్షి, ఆదిలాబాద్: జిల్లాలోని ఆదిలాబాద్, బోథ్ ఏఎంసీ పాలకవర్గాలను వారంలోపు ప్రకటించనున్నట్లు అధికార పార్టీలో చర్చ మొదలైంది. దీంతో ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, పార్టీ రాష్ట్ర ముఖ్య నేతలను కలుస్తూ పైరవీ చేస్తున్నారు. ఆదిలాబాద్ విషయంలో ఊగిసలాట కొనసాగుతోంది. ప్రతీసారి చైర్మన్ పదవిని భర్తీ చేస్తారని చెప్పడం, ఆ తర్వాత ప్రక్రియ నిలిచిపోవడం జరుగుతూ వస్తోంది. ఈసారి మాత్రం తప్పనిసరిగా ఉమ్మడి జిల్లాలోనే అధిక ఆదాయమున్న ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి భర్తీ విషయంలో రాజకీయ ఎత్తుగడలు కొనసాగుతున్నాయనే ప్రచారం సాగుతోంది.
జోరుగా ఆశావహుల పైరవీలు
ఆదిలాబాద్ ఏఎంసీ చైర్మన్ పదవి కోసం కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్‌రెడ్డి తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఇది జనరల్ స్థానం కావడంతో పార్టీలో ముందునుంచి ఉన్న తన పేరు పరిశీలించాలని ముఖ్య నేతలను కోరుతూ వస్తున్నారు. పార్టీ నియోజకవర్గ ముఖ్యనేత కంది శ్రీనివాసరెడ్డికి, బోరంచు శ్రీకాంత్‌రెడ్డికి పొసగకపోవడంతో నాన్చుతున్నారనే ప్రచారం సాగుతోంది. బీసీ నాయకుడు మునిగెల విఠల్‌కు పదవి ఇప్పించేందుకు కంది శ్రీనివాసరెడ్డి ప్రయత్నిస్తున్నారనే ప్రచారమూ ఉంది. బోథ్ బీసీ జనరల్ స్థానం కావడంతో బోథ్‌కు చెందిన మల్లెపూల సత్యనారాయణ, చట్ల ఉమేశ్ ప్రయత్నిస్తున్నారు. ఇదివరకు చైర్మన్‌గా వ్యవహరించిన బొడ్డు గంగారెడ్డి కూడా ప్రయత్నం చేస్తున్నారు. కాగా, ఇక్కడ రిజర్వేషన్ మార్పు కోసం పార్టీకి చెందిన ప్రపుల్‌చందర్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. గతంలోనూ ఈ పదవి కోసం ప్రయత్నించినా రిజర్వేషన్ అనుకూలించలేదని, ఈసారీ అదే పరిస్థితి ఉందని, ఈ దృష్ట్యా రిజర్వేషన్ మార్పు కోసం ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని పార్టీలో చెప్పుకొంటున్నారు. మొత్తంగా ఈ రెండు ఏఎంసీల చైర్మన్ పదవుల విషయంలో త్వరలో ఓ నిర్ణయం వెలువడే అవకాశం ఉందని పార్టీలో ప్రచారం సాగుతోంది.


