ఆదిలాబాద్ ఎస్పీగా గతేడాది మార్చి 10న బాధ్యతలు చేపట్టిన అఖిల్ మహాజన తొ లుత పోలీసు శాఖలో సమూల మార్పులు తీసుకొచ్చారు. ఉద్యోగులంతా క్ర మశిక్షణతో పనిచేసేలా చర్యలు తీసుకున్నారు. విధులు విస్మరించే వారి పై శాఖాపరమైన చర్యలకు పూనుకున్నారు. మరోవైపు మహిళల భద్రతకు పెద్దపీటవేశారు. షీటీం, పోలీస్ అక్క వంటి కార్యక్రమాలతో బాలికలు, యువతులకు అండగా నిలుస్తున్నారు. ఇక రాత్రి వేళ లో ప్రజలు అనవసరంగా బయట తిరకుండా ఆపరేషన్ చబుత్రా కొనసాగిస్తున్నారు. అలాగే వాహనాలు నడిపిస్తున్న మైన ర్ల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. రౌడీషీటర్లకు రౌడీమేళా నిర్వహించి హద్దు మీరితే కఠిన చర్యలుంటాయని హెచ్చరికలు జారీ చేస్తున్నా రు. సీసీ కెమెరాల ఆవశ్యకతను ప్రజలకు వివరిస్తూ వాటిని ఏర్పాటు చేసుకునేలా కృషి చేస్తున్నారు.
అక్రమాలకు చెక్..
జిల్లాలో బ్లాక్‌మెయిలింగ్, వడ్డీ వ్యాపారం, రియల్
ఎస్టేట్‌లో డబుల్ రిజిస్ట్రేషన్, సైబర్‌క్రైమ్, నిషేధిత వ్యాపారాలకు అడ్డుకట్ట వేశారు. ఆన్‌లైన్ బెట్టింగ్ ఆడుతున్న వారిపై కేసులు నమోదు చేశారు. ఈ చర్యలతో అక్రమార్కులు తోకముడిచి స్థానికంగా కనిపించకుండా పోయారు. అలాగే ఇసుక, మొరం అక్రమ దందాకు సైతం చెక్ పెట్టారు. హైవే పక్కన ఉన్న దాబాల్లో మద్యం పూర్తిగా నిషేధించారు. రోడ్డు ప్రమాదాలను అడ్డుకట్టడంపై ప్రత్యేక దృష్టి సారించారు.
ప్రతీ వారం జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహిస్తున్నారు. బాధితులకు అండగా ఉంటూ న్యాయం జరిగేలా చొరవ చూపుతున్నారు. జిల్లాలో ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరిగితే నేరుగా సమాచారం అందించాలనే ఉద్దేశంతో ‘మెసేజ్ యువర్ ఎస్పీ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సుదూర ప్రాంతాల్లో ఉన్న వారు ఎలాంటి సమస్యలు, సమాచారం ఉన్నా వాట్సాప్ నంబర్ 8712659973 ద్వారా తెలియజేసేందుకు వీలు కల్పించారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతున్నారు. సత్వర పరిష్కారం అందేలా చొరవ చూపుతుండడంతో కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోంది.
జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా రూపుమాపుతాం. అక్రమాలకు పాల్పడే వారు ఎంతటివారైనా ఉపేక్షించబోం. ఏదైన అక్రమ దందాలకు సంబంధించి సమాచారం ఉంటే వాట్సాప్ నంబర్ 8712659973కు తెలియజేయాలి. వివరాలు గోప్యంగా ఉంచుతాం. రియల్ ఎస్టేట్ మోసాలపై కఠినంగా వ్యవహరిస్తున్నాం. అలాగే గంజాయి, మట్కా, ఆన్‌లైన్ బెట్టింగ్, ఇసుక, మొరం అక్రమ దందాపై దృష్టి సారించాం. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. మహిళల భద్రతే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. – అఖిల్ మహాజన్, ఎస్పీ


