‘హస్తం’ సర్కారును ఎండగడుతున్న విపక్షాలు రైతుభరోసా ఎప్పుడంటున్న బీఆర్‌ఎస్ ‘ఫసల్ బీమా’ అమలుకు బీజేపీ పట్టు సంతకాల సేకరణతో ఆందోళన బాట
సాక్షి,ఆదిలాబాద్: జిల్లాలో రైతు చుట్టూ రాజకీయం కొనసాగుతుంది. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ ని ఎండగడుతూ ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీలు పోరుబాట పట్టాయి. రైతుభరోసా ఎప్పుడేస్తారంటూ గులాబీ శ్రేణులు ప్రశ్నిస్తుండగా, ఫసల్ బీమా అమలు చేయాలంటూ కమలం పార్టీ డిమాండ్ చేస్తోంది. ఇందులో భాగంగా సంతకాల సేకరణ చేపట్టి గ్రామాల్లో పర్యటిస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.
సంతకాల సేకరణతో..
రైతుభరోసా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న ఆదిలాబాద్ రూరల్ మండలం అంకోలి గ్రామం నుంచి గత శనివారం రైతుల సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నియోజకవర్గంలోని గ్రామాల్లో పర్యటిస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ రాష్ట్రంలో ఫసల్ బీమా యోజనను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతు పోరుబాట కార్యక్రమాన్ని షురూ చేశారు. అందులో భాగంగా సంతకాల సేకరణ చేపడుతున్నారు.
అసెంబ్లీ సమావేశాలు లక్ష్యంగా..
రానున్న అసెంబ్లీ సమావేశాలు లక్ష్యంగా ఈ రెండు పార్టీల ముఖ్య నేతలు రైతుల నుంచి సంతకాల సేకరణ చేపడుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం తీసుకోగా, రైతుల నుంచి 10లక్షల దరఖాస్తులు సేకరించి అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వాన్ని నిలదీస్తూ అందజేస్తామని చెబుతున్నారు. అలాగే రైతు భరోసా ఇవ్వాలని, పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఆదిలాబాద్‌రూరల్ మండలం కచ్‌కంటి, బేల మండలం సాంగిడిలోనూ ఈ కార్యక్రమాలు సాగాయి. రైతు భరోసా త్వరగా విడుదల చేయాలని, అలాగే ప్రతీ పంటకు రూ.500 బోనస్ అందించాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ సంతకాల సేకరణతో రైతుల వద్దకు వెళ్తోంది. కార్యక్రమాన్ని ఆదిలాబాద్ రూరల్ మండలం అకోలి గ్రామంలో ఇటీవల ప్రారంభించారు. భోరజ్ మండలంలోని అకోలి, బేల మండలం సాంగిడిలో కొనసాగాయి.
రైతులు అధైర్యపడొద్దు
కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు రైతుల నుంచి పంటలు కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయి. రాష్ట్రప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదలలో తీవ్ర జాప్యం చేస్తుంది. రైతులు అధైర్య పడవద్దు. బీఆర్‌ఎస్ అండగా ఉంటుంది.
– జోగు రామన్న, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు
కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు
రైతు సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. ఫసల్ బీమా యోజన అమలు చేయాలని బీజేపీ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నా పట్టించుకోవడం లేదు. అందుకే సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టాం.
– పాయల్ శంకర్, ఎమ్మెల్యే, ఆదిలాబాద్


