99 రోజులు ప్రత్యేక వైద్యసేవలు ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో.. నాలుగు దశల్లో పరీక్షలు, వైద్యం జూన్ 12 వరకు కార్యక్రమాలు
ఆదిలాబాద్‌టౌన్: ప్రజారోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నాలుగు దశల్లో వైద్యసేవలు అందించేందుకు చర్యలు చేపట్టింది. మొదటి దశలో గర్భిణులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేపట్టనున్నారు. రెండో దశలో అసంక్రమిత వ్యాధులు, మూడో దశలో సంక్రమణ వ్యాధులు, నాలుగో దశలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ప్రత్యేక వైద్యులతో వైద్య సేవలు అందించనున్నారు. 99 రోజుల పాటు కొనసాగే ఈ కార్యక్రమంలో 30 రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. రిమ్స్‌తో పాటు పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు అర్బన్ హెల్త్ సెంటర్లు, బస్తీ దవాఖానాలు, సబ్ సెంటర్లలో ఈ సేవలు అందించనున్నారు. అలాగే ఆస్పత్రుల్లో పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టనున్నారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోనున్నారు.
నాలుగు దశల్లో సేవలు..
ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా వైద్యారోగ్య శాఖ ద్వారా నాలుగు దశల్లో వైద్య పరీక్షలు చేపట్టనున్నారు. మొదటి విడత ఈనెల 6 నుంచి 12వరకు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రసుతి, కౌమర, వృద్ధులకు రక్తహీనత పరీక్షలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఆరోగ్యం, స్క్రీనింగ్ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రెండో విడత ఏప్రిల్ 1 నుంచి 15 వరకు బీపీ, షుగర్, క్యాన్సర్ తదితర వ్యాధులకు సంబంధించి సబ్‌సెంటర్లలో స్క్రీనింగ్ నిర్వహించనున్నారు. మూడో విడత ఏప్రిల్ 16 నుంచి మే 15 వరకు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా అంటువ్యాధులు, టీబీ, హెచ్‌ఐవీ తదితర వ్యాధులకు సంబంధించి పరీక్షలు చేయనున్నారు. నాలుగో విడత మే 16 నుంచి జూన్ 12 వరకు కంటి పరీక్షలు, దంత పరీక్షలు చేపట్టనున్నారు. దీంతోపాటు హెచ్‌ఐవీపై అవగాహన, మాతా శిశు, నవజాత శిశు మరణాలు తగ్గించడం, ఔషధ మొక్కలపై అవగాహన, మందులు అధికంగా వాడడంతో దుష్పరిణామాలను తెలియజేయనున్నారు. పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ప్రత్యేక వైద్య నిపుణులతో చికిత్స అందించనున్నారు. అలాగే మహిళ సంఘాల సభ్యులకు వ్యాధులకు సంబంధించి స్క్రీనింగ్ చేపట్టనున్నారు. వేసవిలో వడదెబ్బకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర వ్యాధుల గురించి అవగాహన కల్పించనున్నారు.
పకడ్బందీగా నిర్వహిస్తాం..
పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామాల్లోనూ పకడ్బందీగా అమలు చేస్తాం. 99 రోజుల పాటు చేపట్టే కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాల సభ్యులకు ప్రత్యేకంగా స్క్రీనింగ్ చేపడతాం. లక్ష 20వేల మంది సభ్యులు ఉండగా, ప్రతిఒక్కరికి వైద్య పరీక్షలు అందిస్తాం. రిమ్స్‌లోని స్పెషాలిటీ వైద్యులతో గ్రామాల్లో సేవలు అందించేలా చర్యలు చేపడతాం. ఈ అవకాశాన్ని ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి.
– నరేందర్ రాథోడ్, డీఎంహెచ్‌వో


