కై లాస్‌నగర్: ఇటీవల నూతనంగా ఎన్నికై న ఆదిలా బాద్ మున్సిపల్ కౌన్సిల్ తొలి సర్వసభ్య సమావేశం మంగళవారం నిర్వహించనున్నారు. చైర్‌పర్సన్ బండారి అనూష అధ్యక్షతన ఉదయం 11గంటలకు కౌన్సిల్ సమావేశ మందిరంలో కార్యక్రమం ప్రారంభం కానుంది. దాదాపు 13 నెలల తర్వాత నిర్వహిస్తుండడంతో సమస్యల పరిష్కారంపై పట్టణవాసులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రధానంగా వేసవి షురూ కావడంతో తాగునీటి సమస్యను కౌన్సిల్ ఏ విధంగా అధిగమిస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
నీటి ఎద్దడిని నియంత్రిస్తారా..
పట్టణంలో 49 వార్డులున్నాయి. ఇందులో విలీన కా లనీలకు ఇప్పటికీ మిషన్ భగీరథ నీరు సరఫరా కా ని పరిస్థితి. పలు కాలనీల్లో నల్లాలకు ఆనాఫ్ బటన్ లేకపోవడంతో నీరు వృథాగా పోతుంది. లాండసాంగ్వీ పంప్‌హౌస్‌పైనే ఆధారపడాల్సి వస్తోంది. దీంతో ఈ సారి కూడా పలు కాలనీలకు ట్యాంకర్ల నీరే దిక్కయ్యే అవకాశం కనిపిస్తుంది. దీనిపై ఎలాంటి కార్యాచరణతో ముందుకు సాగుతారో చూడాలి.
ఆదాయం పెంచుకునే అవకాశమున్నా ..
గ్రేడ్–1 స్థాయికి ఎదిగిన ఆదిలాబాద్ మున్సిపల్‌లో కార్మికుల వేతనాల చెల్లింపునకు ప్రతిసారి ఇబ్బందులు తప్పడం లేదు. దీన్నిఅధిగమించేలా బల్దియా ఆదాయాన్ని పెంచుకునే అవకాశాలున్నా ఆ దిశగా దృష్టి సారించడం లేదనే విమర్శలున్నాయి. చాలా చోట్ల మడిగెలు ఖాళీగా ఉంటున్నా వాటిని అద్దెకు ఇచ్చే ఆలోచన చేయకపోవడం గమనార్హం.
ఆ నిధుల వినియోగం ఎప్పుడో..
ఆదిలాబాద్ పట్టణాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రూ.18.50 కోట్ల ప్రత్యేక నిధులను విడుదల చేసింది. వాటితో వివిధ కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించేలా అధికారులు ప్రతిపాదనలు గతంలోనే సిద్ధం చేశారు. అయితే రాజకీయ కారణాల కారణంగా వాటిని నిలిపివేశారు. నూతన కౌన్సిల్ రావడంతో అధికారులు మళ్లీ ప్రతిపాదనలు సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. అయితే ప్రాధాన్యత క్రమంగా నిధులు కేటాయించి త్వరగా అభివృద్ధి పనులు చేపడుతారా లేక రాజకీయ జోక్యంతో వాయిదా వేస్తారా అనేదానిపై సర్వత్రా చర్చ సాగుతుంది.
అసంపూర్తి నిర్మాణాల పరిస్థితేంటో..
పట్టణ ప్రజలకు కూరగాయలతో పాటు మాంసం, చేపలు ఒకే చోట అందించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను మంజూరు చేసింది. రూ.5 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ భవన నిర్మాణం అర్ధంతరంగా నిలిచిపోయింది. నాలుగేళ్లు గడుస్తున్నా పనులు ముందుకు సాగని పరిస్థితి. ఇండోర్ స్టేడియం పరిస్థితి అలాగే ఉంది. నిధులు విడుదల లేక ఫిల్లర్లదశలోనే ఆగిపోయింది. వీటిపై కౌన్సిల్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటారా లేక నిధుల లేమి సాకుతో వదిలేస్తారా వేచి చూడాలి.


