ఉదయం చలి.. మధ్యాహ్నం ఎండ | - | Sakshi
Sakshi News home page

ఉదయం చలి.. మధ్యాహ్నం ఎండ

Mar 9 2026 7:23 AM | Updated on Mar 9 2026 7:23 AM

● జిల్లాలో భిన్న వాతావరణం ● దగ్గు, జ్వరంతో జనం అవస్థలు ● పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు

ఆదిలాబాద్‌టౌన్‌: జిల్లాలో భిన్న వాతావరణంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఫిబ్రవరి వరకు చలి తీవ్రత ఉండగా, ప్రస్తుతం ఎండలు దంచికొడుతున్నాయి. తెల్లవారుజామున మాత్రం చలి తీవ్రత ఇంకా కొనసాగుతోంది. మధ్యాహ్నం ఎండ ప్రభా వంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వాతావరణంలో మార్పుల కారణంగా చాలామంది జలు బు, దగ్గుతో పాటు జ్వరాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.

అప్పుడే మండుతున్న భానుడు..

మార్చి మొదటి వారంలోనే జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. భానుడు భగభగ మండిపోతున్నాడు. వారం రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. ఆదివారం కనిష్ట ఉష్ణోగ్రత 16.2 నమోదు కాగా, గరిష్ట ఉష్ణోగ్రత 39 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే ఏప్రిల్‌, మే నెలల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. మధ్యాహ్నం 12 దాటిందంటే బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. నిత్యం కిటకిటలాడే బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌, తెలంగాణచౌక్‌, అంబేద్కర్‌, గాంధీచౌక్‌ ప్రాంతాల్లో రద్దీ కనిపించని పరిస్థితి. చిరు వ్యాపారులు, ఇతర కూలీ పనులు చేసేవారు ఎండ కారణంగా ఇబ్బందులు పడుతున్నారు.

వడదెబ్బతో జాగ్రత్త..

జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న దృష్ట్యా ఎండలో ఎక్కువగా తిరిగే వారు వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. తప్పనిసరిగా ఎండలో బయటకు వెళ్లే వారు గొడుగు, ఇతర రక్షణ కవచాలు ధరించాలని సూచిస్తున్నారు. శరీర ఉష్ణోగ్రత 106 డిగ్రీ ఫారన్‌హీట్‌ దాటితే వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంటుందంటున్నారు. కళ్లు తిరగడం, తీవ్రమైన తలనొప్పి, గుండె ధడ, చెమట ఎక్కువగా రావడం, ఫిట్స్‌ వంటి లక్షణాలు కనిపిస్తాయని చెబుతున్నారు. అలాగే శరీరంలో ప్రొటీన్‌ స్థాయి తగ్గిపోయి అవయవాలు పనిచేయడం ఆగిపోతాయని పేర్కొంటున్నారు. ప్రధానంగా వృద్ధులు, చిన్నారుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement