కమీషన్లపై ఉన్న ధ్యాస ప్రజలపై లేదు
సీఎం రేవంత్‌పై బీజేఎల్‌పీ నేత మహేశ్వర్‌రెడ్డి ధ్వజం
జైనథ్‌లో రైతు పోరుబాట పేరిటఆందోళన
జైనథ్: సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీకి మూటలు పంపడంపై ఉన్న ఆసక్తి రైతులకిచ్చిన హామీలు అమలు చేయడంపై లేదని బీజేపీ శాసనసభపక్ష నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో రైతులకు ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్‌లో పార్టీ ఆధ్వర్యంలో రైతు పోరుబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రైతు సంక్షేమాన్ని పట్టించుకోని రేవంత్ సర్కారుపై తీవ్రంగా మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే రైతుభరోసా నిధులు జమచేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి అందుకోసం ఉంచిన రూ.9వేల కోట్లను నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయని ఢిల్లీ నుంచి పిలుపురాగానే జమ చేయలేదన్నారు. రైతుల ఖాతాల్లో జమ చేయాల్సిన డబ్బులను కాంట్రాక్టర్ల ఖాతాల్లో వేసి వారి నుంచి కమీషన్లు తీసుకుని రాహుల్‌గాంధీ ద్వారా వెయ్యి కోట్లు ఢిల్లీకి పంపించిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కౌలు రైతులను ఆదుకుంటామని, రైతు కూలీలకు రూ.12వేలు ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. రైతుభరోసా జమ చేయకుండా కమీషన్లు, భూముల విక్రయాలపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి అనేక హామీలను విస్మరించారన్నారు. 99 రోజుల ప్రజాపాలన పేరిట ప్రజల్లోకి వెళ్లేందుకు ఎన్ని డబ్బులు కేటాయించరని సీఎంను ప్రశ్నించారు. అభివృద్ధికి ఎన్ని నిధులు కేటాయించారని, ఈ కార్యక్రమంలో పాల్గొనే దమ్ము అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఉందా అని నిలదీశారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, మహిళలకు రూ.2,500 నగదు, వృద్ధులు, దివ్యాంగులకు పెన్షన్ల పెంపు, అలాగే అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వకుండా అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని మండిపడ్డారు. గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్యానికి కూడా డబ్బులు లేవన్నారు. మాజీ సర్పంచ్‌లు చేసిన పనులకు బిల్లులివ్వని దద్దమ్మ సీఎం అని మండిపడ్డారు. అసమర్థ పాలనపై రైతుల నుంచి సేకరించిన సంతకాలను సీఎంకు పంపుతామని తెలిపారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ రైతుల సమస్యలను ముఖ్యమంత్రి అర్థం చేసుకుని వెంటనే రైతు భరోసా నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా 15 రోజుల పాటు కార్యక్రమాన్ని కొనసాగించి పది లక్షల సంతకాలు సేకరిస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీ గోడం నగేశ్, బీజేపీ ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల అధ్యక్షులు బ్రహ్మానంద్, రిథిష్ రాథోడ్, ఎమ్మెల్యేలు రామారావు పటేల్, ధన్‌పాల్ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
జనంలోకి వెళ్లే ధైర్యం కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు లేదు


