‘తల్లి పిలుపు’నకు ఏడేళ్లు | - | Sakshi
Sakshi News home page

‘తల్లి పిలుపు’నకు ఏడేళ్లు

Mar 8 2026 7:35 AM | Updated on Mar 8 2026 7:35 AM

● మాతా, శిశుమరణాల నియంత్రణకు దోహదం ● ప్రతీనెల 5వేల ఫోన్‌ కాల్స్‌ ● గర్భిణుల ఆరోగ్యంపై ఫోకస్‌

ఆదిలాబాద్‌టౌన్‌: మాతా, శిశుమరణాల కట్టడికి వైద్యారోగ్యశాఖ ప్రారంభించిన ‘తల్లి పిలుపు’జిల్లాలో సత్ఫలితాలిస్తోంది. అప్పటి కలెక్టర్‌, ప్రస్తుత సెర్ప్‌ కమిషనర్‌ దివ్యదేవరాజన్‌ శ్రీకారం చుట్టిన ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 2018లో ప్రారంభించిన ఈ కార్యక్రమం నేటితో ఏడేళ్లు పూర్తి చేసుకుంటుంది. జిల్లాలో గర్భిణుల ఆరోగ్యంపై ఫోకస్‌ పెట్టిన కలెక్టర్‌ వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో ప్రత్యేక కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. ఆశకార్యకర్తలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. గర్భం దాల్చిన సమయం నుంచి వారి ప్రసవం వరకు ఫోన్‌ కాల్‌ చేస్తూ ఆరోగ్యంపై ప్రత్యేక సూచనలు చేస్తున్నారు. హైరిస్క్‌ ఉన్నవారిని గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు. వారు సుఖ ప్రసవమయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతీరోజు మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు పీహెచ్‌సీల వారీగా సేకరించిన సమాచారం ఆధారంగా ఫోన్లు చేస్తూ వారి ఆరోగ్యంపై వాకబు చేస్తున్నారు.

వివిధ భాషల్లో..

తల్లి పిలుపు కార్యక్రమం కోసం నలుగురు ఆశ కార్యకర్తలను నియమించారు. ప్రతీరోజు ఒక్కొక్కరు వంద చొప్పున నెలకు 5వేల వరకు ఫోన్‌ కాల్స్‌ చేస్తున్నారు. తెలుగు, హిందీ, లంబాడీ, గోండి, కొలాం భాషల్లో గర్భిణుల ఆరోగ్య స్థితిగతులను తెలుసుకుంటారు. ఇప్పటి వరకు 5 వేల గర్భిణులకు అవసరమైన రక్తాన్ని వైద్య, ఆరోగ్యశాఖ ఏర్పాటు చేసిందని డీఎంహెచ్‌వో నరేందర్‌ రాథోడ్‌ తెలిపారు. వారికి ప్రసవమయ్యే వరకు మూడు, నాలుగు సార్లు ఫోన్‌కాల్స్‌ చేస్తారని పేర్కొన్నారు. ఇప్పటివరకు 4 లక్షల వరకు కాల్స్‌ చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంతో ఏజెన్సీ మారుమూల ప్రాంతాల్లోని గర్భణులకు ప్రయోజనం చేకూరుతున్నట్లు పేర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement