ఆదిలాబాద్: కొల్లాపూర్ నుంచి ధన్బాద్ వెళ్తున్న దీక్షభూమి ఎక్స్‌ప్రెస్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందినట్లు రైల్వే పోలీస్ ఇన్‌చార్జి టి.ప్రభాకర్ తెలిపారు. శనివారం అర్ధరాత్రి 12.15 గంటలకు రైలు ఆదిలాబాద్ స్టేషన్‌కు చేరుకోగా, అపస్మారక స్థితిలో ఉన్న సదరు వ్యక్తిని రైల్వే డాక్టర్ పరీక్షించగా అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు. మృతుడి వయస్సు 30 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుందని, ఎరుపు రంగు ఫుల్‌హాండ్స్ రౌండ్ నెక్ టీషర్ట్, నీలిరంగు నైట్ ప్యాంటు ధరించి ఉన్నాడని వివరించారు. స్టేషన్ మాస్టర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ ఆసుపత్రిలో భద్రపర్చినట్లు వెల్లడించారు. మృతుడి వివరాలు తెలిసినవారు 9963313395 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.
ఉరేసుకుని మహిళ ఆత్మహత్య
తాంసి: అనారోగ్యంతో బాధపడుతున్న మహిళ జీవితంపై విరక్తితో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు భీంపూర్ ఎస్సై విక్రమ్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం..భీంపూర్ మండలం పిప్పల్‌కోటి గ్రామానికి చెందిన పూదరి నాగమ్మ (57) గృహిణి. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతుంది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ఇంట్లో ఉరేసుకుంది. శనివారం ఉదయం గమనించిన కుటుంబీకులు అందించిన సమాచారంతో ఎస్సై అక్కడికి చేరుకుని మృతదేహన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతురాలి కుమారుడు వెంకటేశ్ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


