భుక్తాపూర్‌లో పర్యటించిన చైర్‌పర్సన్‌ | - | Sakshi
Sakshi News home page

భుక్తాపూర్‌లో పర్యటించిన చైర్‌పర్సన్‌

Mar 8 2026 7:34 AM | Updated on Mar 8 2026 7:34 AM

‘సాక్షి’ స్టార్‌ రిపోర్టర్‌గా మున్సిపల్‌ చైర్‌పర్సన్‌

మహిళా పారిశుద్ధ్య కార్మికులతో ముచ్చటించిన అనూష

గ్లౌజులు, సబ్బులు, నూనెలు అందించేలా చర్యలు..

ప్రతీ మూడు నెలలకోసారి వైద్య పరీక్షలు

ఎండల తీవ్రత నేపథ్యంలో మధ్యాహ్నం వరకే విధులుండేలా పలు హామీలు

కైలాస్‌నగర్‌: పట్టణ పరిశుభ్రతలో కీలకపాత్ర పోషిస్తున్న మహిళా పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేస్తామని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బండారి అనూష అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ‘సాక్షి’ స్టార్‌ రిపోర్టర్‌ క్యాంపెయిన్‌లో భాగంగా పట్టణంలోని అంబేడ్కర్‌చౌక్‌లో విధి నిర్వహణలో ఉన్న పారిశుద్ధ్య కార్మికుల వద్దకు వేకువజామున వెళ్లి పలకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జీవన స్థితిగతులపై ఆరా తీఽశారు. వారితో కలిసి టీ తాగారు. అన్ని సమస్యలు పరిష్కరించేలా తనవంతు కృషి చేస్తానని భరోసానిచ్చారు. మహిళా దినోత్సవం సందర్భంగా క్షేత్రస్థాయిలో పరిస్థితిని తెలుసుకునేందుకు ‘సాక్షి’ తీసుకున్న చొరవ అభినందనీయమని అన్నారు. మహిళలందరికీ ఉమెన్స్‌ డే శుభాకాంక్షలు తెలిపారు.

మహిళా కార్మికుల ఆరోగ్యానికి పెద్దపీట

ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌ మాట్లాడారు. వేకువజామునే పట్టణంలోని రోడ్లపైకి చేరుకుని వీధులను శుభ్రం చేసే మహిళా కార్మికులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు అధిక ప్రాధాన్యతనివ్వాలి.. ఇందుకోసం మున్సిపల్‌ పరంగానూ ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం.. విధి నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటాం.. నెలకు 6 చీపుర్లు ఇవ్వడంతో పాటు డ్రెయినేజీలు, రోడ్లను శుభ్రపరిచే క్రమంలో వచ్చే దుమ్మతో ఇబ్బందులు పడకుండా ఉండేలా గ్లౌజులు, కొబ్బరినూనె, సబ్బులతో పాటు బెల్లం అందించేలా చర్యలు తీసుకుంటాం.. తొలి కౌన్సిల్‌ సమావేశంలోనే ప్రాధాన్యత అజెండాగా చేర్చి నిధులు కేటాయించేలా తీర్మానం చేస్తాం.. ఇక నుంచి వాటిని రెగ్యులర్‌గా అందించేలా ప్రత్యేక శ్రద్ద వహిస్తాం.. ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ప్రతీ మూడు నెలలకోసారి బల్దియా ద్వారా ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తాం.. అవసరమైన వారికి ఉచితంగా మెడిసిన్‌ అందించేలా చూస్తాం.. పెరుగుతున్న ఎండల తీవ్రత దృష్ట్యా పారిశుద్ధ్య కార్మికులు ఇబ్బందులు పడకుండా ఉండేలా చర్యలు తీసుకుంటాం.. మధ్యాహ్నం 12గంటల వరకు మాత్రమే విధులు నిర్వహించే వెసులుబాటు కల్పిస్తాం. ఆరోగ్యపరంగానూ ఏమైనా ఇబ్బందులు తలెత్తితే సంబంధిత జవాన్‌, కమిషనర్‌ లేదంటే నేరుగా నా దృష్టికి తీసుకురావచ్చు.. వేతనాల పెంపు విషయాన్ని కూడా పరిశీలిస్తాం. ప్రస్తుతం బల్దియా ఖజానా ఖాళీగా ఉంది. రానున్న రోజుల్లో మున్సిపల్‌ ఆదాయం పెంచుకునేలా చర్యలు చేపడుతామని అన్నారు.

అనంతరం పట్టణంలోని 45వ వార్డు భుక్తాపూర్‌లో పర్యటించారు. కాలనీవాసులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా వీధి కుక్కల బెడద అధికంగా ఉందని వారు చైర్‌పర్సన్‌ దృష్టికి తీసుకువచ్చారు. అలాగే రాత్రివేళలో మూగ జీవాల సంచారంతో ఇబ్బందులు పడాల్సి వస్తుందని, వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని వివరించగా పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తామని చైర్‌పర్సన్‌ హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement