ఆదిలాబాద్‌టౌన్: మహిళలు ఏ రంగంలోనైనా రాణిస్తారనేందుకు ఈ అతివలే నిదర్శనం. హోటల్ నిర్వహణపై ఆసక్తి చూపిన వీరికి ఇందిరా మహిళా శక్తి ద్వారా ప్రభుత్వం అండగా నిలిచింది. జిల్లా కేంద్రంలోని రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో స్వ యం సహాయక సంఘాల సభ్యులతో ఏర్పాటు చేసిన ఈ క్యాంటీన్ ప్రస్తుతం లాభాల బాటలో పయనిస్తోంది. నిర్వాహకులతో పాటు మరికొంత మందికి ఉపాధి చూపుతోంది.
రుచితోపాటు శుచి
ఆసుపత్రిలో తినాలంటే చాలామంది ముందుకు రా రు. పరిసరాల్లో దుర్గంధం, అపరిశుభ్రతే కారణం. అయితే సూపర్ స్పెషాలిటీలో ఏర్పాటు చేసిన క్యాంటిన్‌లోని ఆహారపదార్థాలు రుచితో పాటు శుచి పా టిస్తుండడంతో నిత్యం వినియోగదారులతో కిటకిటలాడుతుంది. వైద్యులతో పాటు రోగుల బంధువులు, పేషెంట్స్ ఇక్కడే టిఫిన్, భోజనం చేస్తున్నారు. ఉదయం 6నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్వహణ చేపడుతున్నారు. తమకు లాభాలు ముఖ్యం కాదని రుచికరమైన భోజనం అందించడమే ప్రధానమని అంటున్నారు నిర్వాహకులు.
మహిళాశక్తిగా చాటుతున్నారు..
ఈ క్యాంటీన్ జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా 2025 జనవరి 6న ప్రారంభమైంది. మొదట్లో గిరాకీ లేక వండిన ఆహార పదార్థాలను పడేసేవారు. తొలుత నిర్వాహకులు కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఓపికగా ముందుకు సాగారు. ప్రస్తుతం ముగ్గురు సభ్యులు సరోజ, రమాదేవి, లావణ్యతో పాటు మరో ఇద్దరు వర్కర్లు పనిచేస్తున్నారు. వర్కర్లకు నెలకు రూ.12వేల చొప్పున చెల్లించడంతో పాటు తమకు సైతం గిట్టుబాటు అయ్యేలా క్యాంటిన్‌ను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. రోజు 30 మంది వైద్యులు, 60నుంచి 70 మంది రోగులు, వారి సహాయకులు టిఫిన్ చేస్తున్నారని, 50 మంది వరకు భోజనం చేస్తున్నట్లుగా పేర్కొంటున్నారు. బయటి హోటళ్ల మాదిరిగానే రేట్లు ఉన్నప్పటికి నాణ్యతలో రాజీపడటం లేదు. కజ్జర్ల గ్రామానికి చెందిన సరోజ చిన్నచిన్న భోజనం ఆర్డర్లను తీసుకుంటూ జీవనం సాగిస్తుండగా, ఆది లాబాద్ పట్టణానికి చెందిన రమాదేవి టైలరింగ్, కజ్జర్లకు చెందిన లావణ్య వ్యవసాయ పనులు చేసేవారు. ప్రస్తుతం తమతో పాటు మరి కొంతమందికి ఉపాధి కల్పిస్తున్నామని చెబుతున్నారు వీరు. తమకు ఉపాధి అవకాశం కల్పించిన ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు.


