● సరఫరా సైతం నిలిచింది ● డొమెస్టిక్ సిలిండర్‌పై రూ.60 పెంపు ● లబోదిబోమంటున్న ‘గృహ’ లబ్ధిదారులు
కై లాస్‌నగర్: వంట గ్యాస్ ధర మండింది. ఇరాన్–ఇజ్రాయిల్ యుద్ద ప్రభావం మన వద్ద సెగ చూపుతోంది. చాలా దేశాలకు ఇంధన కేంద్రమైన ఇరాన్ నుంచి గ్యాస్, క్రూడాయిల్ సరఫరాకు బ్రేక్ పడింది. ఈ క్రమంలో జిల్లాకు శనివారం సిలిండర్ల సరఫ రా నిలిచిపోయింది. దీనికి తోడు గృహావసరాలకు వినియోగించే 14.2 కిలోల ఎల్‌పీజీ ధరను ఆయిల్ కంపెనీలు ఏకంగా రూ.60 పెంచేశాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న సబ్సిడీ కూడా అందని పరిస్థితి. దీంతో సిలిండర్ ధర రూ.1000కి చేరువైంది. ఇప్పటికే ఆకాశాన్నంటిన నిత్యావసరాల ధరతో లబోదిబోమంటున్న సామాన్యుడికి ఇది మరింత భారం కానుంది. ధర పెంపుతో జిల్లాలోని వంటగ్యాస్ వినియోగదారులపై నెలకు రూ.1.23 కోట్ల అదనపు భారం పడనుంది.
ఉజ్వల, దీపం లబ్ధిదారులకు సైతం వర్తింపు
ఇది వరకు వంట గ్యాస్ ధర పెంపును కేంద్ర ప్రభుత్వం కేవలం జనరల్ కనెక్షన్ దారులకు మాత్రమే పరిమితం చేసేది. తాజాగా ఉజ్వల,దీపం కనెక్షన్‌దా రులకు సైతం వర్తింపజేసింది. ఈ కనెక్షన్లన్నీ నిరుపేదలకు కేంద్రం మంజూరు చేసినవే. వీటికి సిలిండర్‌కు రూ.300 సబ్సిడీగా ఇచ్చేది. తాజాగా అలాంటి వారిపైన కూడా భారం పడనుంది. మొన్నటి వరకు నామమాత్రంగా అందించే రూ.47 సబ్సిడీని సైతం నిలిపివేసింది. రాష్ట్ర ప్రభుత్వం రూ.500 వంటగ్యాస్ సిలిండర్లను సరఫరా చేస్తున్నామని చెబుతున్నా ప్రభుత్వపరంగా చెల్లించే సొమ్ము నెలల తరబడి లబ్ధిదారుల ఖాతాల్లో జమ కాని పరిస్థితి.
జిల్లాలో..
వంట గ్యాస్ ఏజెన్సీలు 17
గ్యాస్ కనెక్షన్ల వివరాలు 2,05,250
దీపం 46,136
ఉజ్వల 36,960
జనరల్ 1,22,154
నిన్నటి వరకు ఎల్‌పీజీ ధర రూ.932
పెంపు తర్వాత ధర రూ.992


