నిర్మల్‌ కవి దేవరావుకు సారస్వత పరిషత్‌ పురస్కారం | - | Sakshi
Sakshi News home page

నిర్మల్‌ కవి దేవరావుకు సారస్వత పరిషత్‌ పురస్కారం

Mar 7 2026 7:34 AM | Updated on Mar 7 2026 7:34 AM

● భాష, సాహితీ, చారిత్రక సేవలకు గుర్తింపు ● హర్షం వ్యక్తంజేస్తున్న సాహితీవేత్తలు

నిర్మల్‌ఖిల్లా: నిర్మల్‌ జిల్లా కేంద్రానికి చెందిన కవి, సాహితీవేత్త, చరిత్ర పరిశోధకుడు తుమ్మల దేవరావుకు ప్రతిష్టాత్మక డాక్టర్‌ బీఎన్‌ శాస్త్రి ధర్మనిధి పురస్కారం వరించింది. తెలంగాణ సారస్వత పరిషత్‌ ఆధ్వర్యంలో భాష, సాహిత్యం, చరిత్ర రంగాల్లో విశేష కృషి చేస్తున్నవారికి ఏటా ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తుండగా ఈసారి దేవరావు ఎంపికై నట్లు పరిషత్‌ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ చెన్నయ్య వెల్లడించారు. ఈ నెల 17న హైదరాబాద్‌లోని తెలంగాణ సారస్వత పరిషత్‌ ప్రాంగణంలోని దేవులపల్లి రామానుజరావు కళామందిరంలో నిర్వహించే కార్యక్రమంలో పురస్కారం అందజేయనున్నారు. ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షతన, డాక్టర్‌ చెన్నయ్య ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో రూ.5వేల నగదు, జ్ఞాపిక, శాలువా, ప్రశంసాపత్రాన్ని దేవరావుకు ప్రదానం చేయనున్నారు.

చరిత్ర పరిశోధనలో ప్రత్యేక ముద్ర

ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తూనే పాతికేళ్లుగా తుమ్మల దేవరావు చరిత్ర పరిశోధనలో నిరంతరం కృషి చేస్తున్నారు. కన్నడ, తె లుగు, ఉర్దూ, ఫారసీ భాషలకు చెందిన 17 శాసనాలను వెలుగులోకి తెచ్చి చారిత్రక అధ్యయనానికి తోడ్పడ్డారు. నిర్మల్‌ ఉత్సవాల్లో తాను శోధించిన అనేక అంశాలు, పురాతన వస్తువులతో ప్రదర్శన నిర్వహిస్తున్నారు.

గతంలోనూ అవార్డులు

సాహిత్య, చారిత్రక రంగాల్లో చేసిన కృషికి గాను దేవరావు ఇప్పటికే పలు పురస్కారాలు అందుకున్నారు. తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం, భాషా సాంస్కృతిక శాఖ ఉత్తమ పరిశోధన పురస్కారం, సినారె పురస్కారం, సినారె కళాపీఠం జాతీయ పురస్కారం, రంజని–కుందుర్తి, ఎక్స్‌రే, కవిసంధ్య, గుర్రం జాషువా, విమల శాంతి, గిడుగు రామమూర్తి పంతులు జాతీయ అవార్డులు ఆయనకు లభించాయి. తాజాగా ఆయనకు ధర్మనిధి పురస్కారం దక్కడంతో జిల్లాకు చెందిన పలువురు సాహితీవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement