సాక్షి,ఆదిలాబాద్: డబుల్ రిజిస్ట్రేషన్లు చేస్తూ మోసాలకు పాల్పడుతున్న మహిళపై మావల పోలీసు స్టేషన్‌లో గురువారం కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 175 సర్వేనంబర్‌లోని 23వ ప్లాట్ నంబర్‌కు సంబంధించి డబుల్ రిజిస్ట్రేషన్ విషయంలో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఆ రియల్ వ్యాపారిని అరెస్టు చేశారు. అయితే ఈ సర్వేనంబర్‌లో ఇలాంటి అనేక ప్లాట్లు డబుల్ రిజిస్ట్రేషన్ జరిగాయనే ఆరోపణలు ప్రస్తుతం వెల్లువెత్తుతున్నాయి. మిగతా బాధితులు కూడా పోలీసులను ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఆదిలాబాద్ పట్టణ చుట్టుపక్కలా ఉన్న బట్టిసావర్గాం, మావల, దస్నాపూర్, ఖానాపూర్, అంకోలి రోడ్, రణదీవెనగర్‌లలో అనేక లేఔట్‌లు ఉన్నాయి. ఎన్నో ఏళ్ల కింద ఇవి ఏర్పడ్డాయి. వాటిలో అనేకచోట్ల డబుల్ రిజిస్ట్రేషన్లు, ఒక ప్లాట్ చూయించి వేరేది రిజిస్ట్రేషన్ చేయడం వంటివి కోకొల్లాలు.
ధనార్జనే ధ్యేయంగా..
రియల్ వ్యాపారులు, కొంత మంది దళారులు స్వార్థంగా వ్యవహరిస్తూ ధనార్జనే ధ్యేయంగా ఇలా అమాయకులకు ఒకే ప్లాట్‌ను రెండు సార్లు విక్రయిస్తున్నారు. 175 సర్వేనంబర్‌లో 1996లో ఏర్పాటు చేసిన లేఔట్‌లో 100కు పైగా ప్లాట్లను విక్రయించారు. ఆ తర్వాత 2011–12లో ఇవే ప్లాట్లలో కొన్నింటిని ఇతర వ్యక్తులకు విక్రయించారు. వారు ఇతరులకు విక్రయించే క్రమంలో ఈసీ తీయగా, మొదటి రిజిస్ట్రేషన్ పేర్లు రావడంతో ఖంగు తిన్నారు. ఇలా అనేక మంది తాము నష్టపోయామని నిర్ధారణకు వచ్చారు. ఈ విషయంలో మొదటి పార్టీకి, రెండో పార్టీకి మధ్య ప్లాట్ విషయంలో గొడవలు చోటుచేసుకుంటున్నాయి.
అధికారుల పాత్రపైనా అనుమానాలు
ఆన్‌లైన్ వ్యవస్థ అంతగా అభివృద్ధి చెందని ఆ సమయంలో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వ్యవహారాలు మ్యానువల్‌గా సాగేవి. సబ్ రిజిస్ట్రార్ ఈసీని ఆఫీస్ నుంచి ఈ విధానంలోనే జారీ చేసేవారు. ఈ క్రమంలో రియల్టర్లు, అధికారులు కలిసి అక్రమాలకు పాల్పడ్డారన్న విమర్శలూ లేకపోలేదు. 1996లో మొదటి పార్టీ రిజిస్ట్రేషన్లు 175 సర్వేనంబర్‌లో జరిగినప్పటికీ, అక్కడ ఎలాంటి రిజిస్ట్రేషన్లు జరగలేదని నిల్ అని పేర్కొంటూ ఈసీ జారీ చేయడం ఇదే కోవలోకి వస్తుందని రిజిస్ట్రేషన్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఎస్పీ చొరవతో..
ఎస్పీ అఖిల్ మహాజన్ ఇలాంటి విషయాల్లో బాధితుల పక్షాన నిలవడంతో మోసాలకు సంబంధించి కేసులు నమోదవుతున్నాయని పలువురు అభిప్రాయ పడుతున్నారు. 175 సర్వే నంబర్‌లో ఇప్పటికే పలువురి ప్లాట్లు డబుల్ రిజిస్ట్రేషన్లు జరగగా, వారు రియల్ వ్యాపారిని ఆశ్రయించి ఈ విషయంలో నిలదీశారు. ఆ వ్యాపారి 2011–12లో డబుల్ రిజిస్ట్రేషన్ బాధితులు ఏ రేటుకై తే ప్లాట్‌ను కొనుగోలు చేశారో ఆ రేటు తిరిగి ఇస్తానని వారితో పేర్కొనడం జరిగింది. అందులో కొంత మొత్తం మొదటి పార్టీ భరించాలని ఆమె మొదటి రిజిస్ట్రేషన్ వ్యక్తులను అడిగారు. అయితే రెండో రిజిస్ట్రేషన్ ద్వారా ప్లాట్ పొందిన బాధితులు తమకు ప్రస్తుతం ఉన్న మార్కెట్ ధర విలువ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో వారి మధ్య సయోధ్య కుదరకపోవడంతో కొంత మంది పోలీసులను ఆశ్రయించారు. మావలలో ప్రస్తుతం ఒక్క ప్లాట్‌కు సంబంధించి డబుల్ రిజిస్ట్రేషన్ విషయంలో కేసు నమోదైంది. అనేక మంది బాధితులు ఈ విషయంలో న్యాయం చేయాలని కోరుతున్నారు.
2012లో తీసిన ఈసీలో మొదటి రిజిస్ట్రేషన్
వివరాలు నిల్ అని ఉన్న దృశ్యమిది
ఇది 175 సర్వేనంబర్‌లో 70, 110, 107, 119, 121 ప్లాట్లకు సంబంధించి ఇన్కంబరెన్స్ సర్టిఫికెట్ (ఈసీ). స్పష్టమైన యాజమాన్యాన్ని నిరూపించడానికి ఇది సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి జారీ చేస్తారు. ఇందులో మొదటి మూడు నంబర్లు గల ప్లాట్లు ఆ దిలాబాద్ పట్టణంలోని భుక్తాపూర్ కాలనీకి చెందిన సంతోష్ కుమార్, భాస్కర్‌లకు సంబంధించినవి. 1996లో మావలలోని సర్వే నం.175లో వారు ఈ ప్లాట్లను చింతలపల్లి ఆశలత
అనే స్థిరాస్తి వ్యాపారి నుంచి కొనుగోలు చేశారు. అవే ప్లాట్లను 2011–12లో ఇదే స్థిరాస్తి వ్యాపారి ఆ ప్లాట్లను ఇతర వ్యక్తులకు విక్రయించారు. డబుల్ రిజిస్ట్రేషన్ కూడా జరిగిపోయాయి.
ఆ సమయంలో ఈసీ తీయగా, ఆ ప్లాట్లపై మొదటి రిజిస్ట్రేషన్ వివరాలు అసలుకే లేకపోవడం గమనార్హం.


