ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటుకు.. మూడు నెలల క్రితమే జీవో జారీ ప్రభుత్వ భూమి సైతం సిద్ధం అయినా పట్టించుకోని యంత్రాంగం
కై లాస్‌నగర్: నిరుపేద విద్యార్థులకు అధునాతన వసతులతో కూడిన కార్పొరేట్ స్థాయి విద్యనందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదిలాబాద్ నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌ను మంజూరు చేసింది. రూ.200 కోట్లతో ఈ భవనాన్ని నిర్మించేలా గతేడాది డిసెంబర్ 2న జీవో జారీ చేసింది. ప్రతిష్టాత్మకమైన స్కూల్ మంజూరు కావడంపై నియోజకవర్గ ప్రజల్లో హర్షం వ్యక్తమైంది. అవసరమైన స్థలం కూడా సిద్ధంగా ఉండటం, జీవో సైతం జారీ కావడంతో ఇక పనుల ప్రారంభమే తరువాయి అని అంతా భావించారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేకపోవడం గమనార్హం.
ఉద్దేశమేంటంటే..
నిరుపేద విద్యార్థులకు కేజీ టు పీజీ వరకు ఒకే చోట నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు శ్రీకారం చుట్టింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నాలుగు మంజూరు చేయగా అందులో ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఒకటి అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. కార్పొరేట్ స్కూళ్లకు ఏమాత్రం తీసిపోని విధంగా అధునాతన వసతులతో కూడిన పాఠశాల భవనం, వసతిగృహ భవనాలను నిర్మించాలని సంకల్పించింది. 1200 మంది విద్యార్థులకు ఒకే చోట బోధన అందించేలా అన్ని వసతులు కల్పించాలని భావించింది. దీంతో నియోజకవర్గంలోని పేద తల్లిదండ్రుల్లో హర్షం వ్యక్తమైంది. తమ పిల్లలకు నాణ్యమైన విద్య అందుబాటులోకి వస్తుందని ఆశపడ్డారు. ఆ స్కూల్ ఎప్పుడు ప్రారంభిస్తారా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే పనుల ప్రారంభంలో నెలలు గడుస్తున్నా కదలిక లేకపోవడం వారిని నిరాశకు గురిచేస్తోంది.
మూడు నెలలు దాటినా...
ప్రభుత్వ ఆదేశాల మేరకు రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణం కోసం ఆదిలాబాద్ పట్టణ శివారు నిషాన్‌ఘాట్‌లో 30 ఎకరాల స్థలాన్ని జిల్లా అధికారులు గుర్తించారు. వివరాలతో కూడిన ప్రతిపాదనలు పంపగా ప్రభుత్వం ఆమోదం కూడా తెలిపింది. గతేడాది పంచాయతీ ఎన్నికల సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన బహిరంగసభకు హాజరయ్యారు. ముఖ్యమంత్రి రాక నేపథ్యంలో రెండు రోజుల ముందుగా జిల్లాకు కానుక అందించినట్లుగా ప్రభుత్వం ఈ స్కూల్‌ను మంజూరు చేస్తూ డిసెంబర్ 2న జీవో జారీ చేసింది. రూ.200 కోట్ల అంచనా వ్యయంతో భవన సముదాయం నిర్మించనున్నట్లుగా పేర్కొంటూ పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎన్.శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే నిర్మాణానికి అవసరమైన స్థలం సిద్ధంగా ఉండటం, జీవో జారీ కావడంతో ఇక పనులే తరువాయి అని అంతా భావించారు. మూడు నెలలు దాటిన నిర్మాణ దిశగా అడుగు ముందుకు పడలేదు. దీంతో నియోజకవర్గ ప్రజలతో పాటు నిరుపేద విద్యార్థుల తల్లిదండ్రుల్లో నిరాశ వ్యక్తమవుతుంది.
టెండర్ దశలో ఉంది
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరుకు సంబంధించి ప్రభుత్వం జీవో జారీ చేసింది. స్థలం కూడా ఇది వరకే ఎంపిక చేసి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం భవన నిర్మాణానికి సంబంధించి టెండర్ దశలో కొనసాగుతుంది. త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తి చేసి పనులు మొదలయ్యేలా చూస్తాం.
–రవీందర్, టీఎస్‌ఈడబ్ల్యూఐడీసీ ఈఈ


