అటవీశాఖ కార్యాలయం ఎదుట ఆందోళన
బోథ్: ప్రసిద్ధి గాంచిన కై లాస్ టెక్డి శివాలయ అభివృద్ధిని వన్యప్రాణుల పరిరక్షణ పేరిట అటవీశాఖ అధికారులు అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ భక్తులు శుక్రవారం మండల కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయం ఎదుట బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి ఆందోళనకు దిగారు. ఆలయానికి అనుబంధంగా 25ఏళ్లుగా కొనసాగుతున్న గోశాలను తొలగించాలని అధికారులు సూచించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గోశాల నిర్వాహకుల్లో నలుగురిని రాత్రి పూట అటవీశాఖ కార్యాలయానికి తీసుకెళ్లడం ఏమిటని భక్తులు, నాయకులు ప్రశ్నించారు. ఉదయం సమాచారం అందుకున్న మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్‌తో పాటు భక్తులు అటవీ కార్యాలయానికి చేరుకుని విషయాన్ని ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌కు ఫోన్‌లో తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే కలెక్టర్‌తో మాట్లాడి సమస్య పరిష్కరించాలని కోరినట్లు సమాచారం. తదుపరి చర్చల అనంతరం గోశాలకు ఇబ్బంది కలగకుండా పరిష్కారం చూపాలని అటవీ అధికారులతో మాట్లాడి నిర్వాహకులను విడుదల చేయించారు. నిగిని, కంటేగావ్, బాబేర తండా గ్రామాల సర్పంచులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


