‘అంగన్‌వాడీ’పై ఫోకస్
సర్పంచ్‌లకు పర్యవేక్షణ బాధ్యతలు 11 మంది సభ్యులతో కమిటీ అక్రమాలు అరికట్టేందుకు చర్యలు గర్భిణులు, చిన్నారులకు మేలు జరిగే అవకాశం
ఆదిలాబాద్‌టౌన్: అంగన్‌వాడీ కేంద్రాల పర్యవేక్షణ బాధ్యతలను సర్పంచులకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేయనున్నారు. దీంతో ఆయా కేంద్రాల్లోని చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారం అందనుంది. అలాగే సిబ్బంది సమయపాలన మెరుగవడంతోపాటు అక్రమాలకు చెక్ పడనుంది.
11 మందితో కమిటీ..
అంగన్వాడీ కేంద్రాల పర్యవేక్షణకు సంబంధించి 11 మందితో కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీకి సర్పంచ్ చైర్‌పర్సన్‌గా, అంగన్‌వాడీ టీచర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఏఎన్‌ఎం, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు, రిటైర్డ్ ఉద్యోగి, చిన్నారుల తల్లిదండ్రులు సభ్యులుగా ఉంటారు.
అక్రమాలకు చెక్..
అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులతో పాటు గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తున్నారు. అయితే కొన్ని కేంద్రాల్లో టీచర్లు, ఆయాలు సరుకులను పక్కదారి పట్టిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నా యి. అలాగే సమయపాలన పాటించకపోవడం, కొంత మంది కేంద్రానికి రాకపోవడం, హాజరు వే సుకొని ఇంటిబాట పట్టడం, సొంత పనుల్లో బిజీగా ఉండడంతో కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. చిన్నారులకు ఆటపాటలతో విద్య అందించాల్సి ఉండగా, వారిని కూర్చోబెట్టి వెళ్లిపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయా కేంద్రాలకు చిన్నారులను తీసుకొచ్చే బాధ్యత ఉన్నప్పటికీ విస్మరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అలాగే చిన్నారులకు ఇచ్చే మురుకులు, కోడిగుడ్లు సక్రమంగా అందించడం లేదనే ఆరోపణలు లేకపోలేదు. ఆరోగ్యలక్ష్మి పథకం కింద గర్భిణులు, బాలింతలతో పాటు మూడు నుంచి ఆరేళలోపు చిన్నారులకు భోజనం పెట్టాల్సి ఉంటుంది. ఉడికించిన గుడ్డు ఇ వ్వాల్సి ఉంటుంది. అయితే కొంత మంది టీచర్లు స రుకులను లబ్ధిదారుల ఇంటికి ఇవ్వడంతో వాటిని ఇంటిల్లిపాది వినియోగిస్తున్నారు. దీంతో గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందడం లేదు. అ యితే ఈ కమిటీతో ఇలాంటి వాటికి చెక్ పడనుంది.
పర్యవేక్షణతో గాడిన పడేనా..
సర్పంచ్‌లకు అంగన్‌వాడీ కేంద్రాల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించడంతో కేంద్రాలు గాడిన పడతాయని పలువురు చర్చించుకుంటున్నారు. ఆయా కేంద్రాలను ఐసీడీఎస్ పీడీతో పాటు సీడీపీవోలు, సూపర్‌వైజర్లు పర్యవేక్షించాల్సి ఉంటుంది. వీరిలో చాలా మంది కార్యాలయానికే పరిమితం కావడం, చుట్టంచూపుగా వచ్చి వెళ్లడమే తప్పా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతుందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఆయా కేంద్రాల్లో చిన్నారులు ఉండకపోయినా సరుకులను లబ్ధిదారులకు ఇచ్చినట్లుగా కొంత మంది నమోదు చేసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. సర్పంచ్‌తో పాటు కమిటీ సభ్యులు పర్యవేక్షించనుండడంతో పూర్వ ప్రాథమిక విద్య బలోపేతం కానుంది. ఇక్కడ చదివిన పిల్లలను సర్కారు బడిలో చేర్పించడంతో అందులోనూ విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
జిల్లాలో..
అంగన్‌వాడీ కేంద్రాలు: 1,288
చిన్నారులు : 60వేలు
పనిచేస్తున్న టీచర్లు : 1,170
టీచర్ల ఖాళీలు: 118
పనిచేస్తున్న ఆయాలు : 889
ఆయాల ఖాళీలు : 399


