షాక్!
మెజార్టీ వార్డులు గెలిచినా దక్కని పీఠం కూటమి ఎత్తులను చిత్తుచేయడంలో విఫలం బీజేపీని దెబ్బకొట్టడంలో కాంగ్రెస్ సక్సెస్ ఫలించిన బీఆర్‌ఎస్ ఎత్తుగడ
వాతావరణం
వాతావరణం పొడిగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండ తీవ్రత పెరగనుంది. వేకువజామున పొగమంచు ప్రభావం కనిపిస్తుంది.
కమలం పార్టీకి
కై లాస్‌నగర్: ఆదిలాబాద్ ‘పుర’ రాజకీయంలో బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. మెజార్టీ స్థానాలను కై వసం చేసుకోవడంతో పీఠం ఇక ఆ పార్టీకే అని అంతా భావించారు. ఆ దిశగా పార్టీ నాయకత్వం ప్రయత్నాలు కూడా మొదలుపెట్టింది. క్యాంపు రాజకీయలకు తెరలేపడంతో ఇక లాంఛనమే మిగిలిందని అనుకున్నారు. అయితే అనూహ్యంగా తెరపైకి వచ్చిన కూటమి రూపంలో కమలం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీకి కుర్చీ దక్కకుండా చేయడంలో కాంగ్రెస్ సక్సెస్ కాగా , బీఆర్‌ఎస్ ఎత్తుగడలు ఫలించాయి. కూటమి అంచనాలను పసిగట్టడంలో విఫలమైన బీజేపీ ఊహించని రీతిలో చతికిలపడింది. ఇది కాషాయ శ్రేణులకు తీవ్ర నిరాశ మిగల్చగా.. కూటమి పార్టీ శ్రేణుల నుంచి మాత్రం హర్షం వ్యక్తమవుతోంది.
మెజార్టీ వార్డుల్లో గెలిచినా..
ఆదిలాబాద్ పట్టణంలో మొత్తం 49 వార్డులుండగా బీజేపీ అత్యధికంగా 21 స్థానాలను కై వసం చేసుకుంది. అలాగే కాంగ్రెస్ నుంచి 11 మంది, బీఆర్‌ఎస్, ఎంఐఎంల నుంచి చెరో ఆరుగురు చొప్పున కౌన్సిలర్లుగా గెలుపొందారు. మరో ఐదుగురు స్వతంత్రులుగా విజయం సాధించారు. దీంతో ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ లభించలేదు. బీజేపీ అత్యధిక సీట్లు గెలువడం ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ అదే పార్టీ నుంచి ఎక్స్ అఫిషియో ఓట్లు నమోదు చేసుకోవడంతో బల్దియాపై కాషాయజెండా రెపరెపలు ఖాయమనే చర్చ ఊపందుకుంది. అందుకు బలం చేకూర్చేలా ఎమ్మెల్యే శంకర్ ఆ పార్టీ కౌన్సిలర్లందరినీ శిబిరానికి తరలించారు. ఇండిపెండెంట్ల మద్దతు కూడగట్టే ప్రయత్నాలు కూడా చేయడంతో చైర్‌పర్సన్ పదవీ కమలం పార్టీకే దక్కుతుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. అయితే స్వతంత్రులను కూడగట్టడంలో విఫలమై పీఠానికి దూరమయ్యారు.
కూటమి రూపంలో ఆశలకు గండి ..
మున్సిపల్‌పై కాషాయ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేసిన బీజేపీ ఆశలకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలతో కూడిన కూటమి గండికొట్టింది. చైర్‌పర్సన్ పదవీ బీజేపీకి దక్కకూడదనే ఉద్దేశంతో కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలతో డీసీసీ అధ్యక్షుడు నరేశ్‌జాదవ్ రంగంలోకి దిగారు. ఇండిపెండెంట్లుగా విజయం సాధించిన బండారి అనూషతో పాటు విజయ్‌కుమార్, శాలినిలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో కొనసాగిన బండారి సతీశ్ తన భార్యకు పార్టీ టికెట్ దక్కకపోవడంతో చివరి నిమిషంలో ఇండిపెండెంట్‌గా బరిలోకి దింపి విజయం సాధించిన విషయం తెలిసిందే. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్నతోనూ నరేశ్‌జాదవ్ సంప్రదింపులు జరిపి ఆ పార్టీ మద్దతు కోరారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థికి కాకుండా మున్నూరుకాపు సామాజిక వర్గానికి చెందిన ఇండిపెండెంట్ కౌన్సిలర్ అనూషను చైర్‌పర్సన్‌గా చేస్తే సహకరిస్తామని ఆయన స్పష్టం చేసినట్లు తెలిసింది. దీనికి అంగీకరించిన ‘హస్తం’ పార్టీ ఎంఐఎంను కూడా సంప్రదించి ఆ పార్టీ మద్దతు కూడా కూడగట్టింది. ఇలా మూడు పార్టీలు, స్వతంత్రులతో కూడిన కూటమిగా ఏర్పడి అనూషను చైర్‌పర్సన్ అభ్యర్థిగా ప్రతిపాదించారు. వ్యూహాత్మకంగా ముందుకు సాగి సక్సెస్ అయ్యారు. వైస్ చైర్మన్ విషయంలోనూ రామన్న ఎత్తుగడే ఫలించినట్లు తెలుస్తోంది. ఎంఐఎం, కాంగ్రెస్‌లు తొలుత 34వ వార్డు నుంచి గెలుపొందిన ఆ పార్టీ అధ్యక్షుడు నజీర్ అహ్మద్‌ను ప్రతిపాదించినట్లుగా సమాచారం. అయితే ఇందుకు రామన్న అంగీకరించలేదనే చర్చ ఉంది. ఆ కౌన్సిలర్ కాకుండా ఆ పార్టీ నుంచి గెలిచిన ఎవరికి ఇచ్చినా సహకరిస్తామని తెల్చిచెప్పినట్లుగా సమాచారం. దీంతో 44వ వార్డు కౌన్సిలర్ మహ్మద్ రోహిత్‌ను చివరి నిమిషంలో వైస్‌చైర్మన్‌గా ఎంపిక చేసి సక్సెస్ అయినట్లుగా తెలుస్తోంది. ఈ మొత్తం ప్రక్రియ బీఆర్‌ఎస్ ఎత్తుగడగా ఆ పార్టీ సోషల్ మీడియాలో ప్రచారం సాగుతుండగా.. కాంగ్రెస్ నాయకులు మాత్రం చైర్‌పర్సన్ పీఠం తమ పార్టీకే దక్కినట్లుగా సంతోషం వ్యక్తం చేయడం గమనార్హం.


