పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు
పటిష్ట బందోబస్తు
ఆదిలాబాద్‌టౌన్: మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక కోసం పోలీసు శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. సోమవారం వినాయక్ చౌక్ నుంచి మున్సిపల్ కార్యాలయం, అశోక్ రోడ్ ప్రాంతంలో 144 సెక్షన్ అమలు చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆ ప్రాంతంలో ఎవరినీ అనుమతించలేదు. షాపులు, హోటళ్లను ముందస్తుగానే మూసివేయించారు. ఆ రూట్లలో వాహనదారులు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. బందోబస్తును ఎస్పీ అఖిల్ మహాజన్ పర్యవేక్షించారు. అధికారులతో పాటు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రక్రియ ముగిసేంత వరకు డీఎస్పీ జీవన్‌రెడ్డితో పాటు సీఐ సునిల్ కుమార్, ఎస్సైలు పర్యవేక్షించారు. ఎన్నికై న కౌన్సిలర్లు, మీడియాను మాత్రమే అనుమతించారు. మున్సిపల్ కార్యాలయంలో గేటు వద్ద ప్రతిఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే లోనికి పంపించారు. సెల్‌ఫోన్లు, ఇతర వస్తువులను అనుమతించలేదు. పటిష్టమైన భద్రత చర్యలు చేపట్టడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది.
కై లాస్‌నగర్: ఇంటర్మీడియెట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. పరీక్షల ఏర్పాట్లపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈనెల 25 నుంచి మార్చి 18 వరకు నిర్వహించనున్న పరీక్షలను కట్టుదిట్టంగా చేపట్టాలని సూచించారు. విద్యార్థులకు ఐదు నిమిషాల గ్రేస్ పీరియడ్ కల్పిస్తున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 31 కేంద్రాలను ఏర్పాటు చేయగా, ప్రతీ కేంద్రానికి చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంటల్ అధికారులను నియమించినట్లు పేర్కొన్నారు. అదనంగా 9 మంది సీఎస్‌వోలను నియమించినట్లు తెలిపారు. ప్రశ్నపత్రాలు, జవాబు పత్రాల రవాణా విషయంలో అప్రమత్తంగా ఉండాలని, జిల్లాలోని 13 పోలీస్ స్టేషన్లలో స్ట్రాంగ్ రూమ్‌లు ఏర్పాటు చేసి భద్రత మధ్య రవాణా చేయాలని ఆదేశించారు. పరీక్షల సమయంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. విద్యార్థుల సౌకర్యార్థం ఉదయం 6 నుంచి 8 గంటల వరకు ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో సెక్షన్ 163 అమలు చేసి, సీసీ కెమెరాల ద్వా రా నిఘా కొనసాగించాలని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, డీఐఈవో గణేశ్‌జాదవ్, ఆర్టీసీ, వైద్య, విద్యుత్, పోలీస్, రవాణా తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
పదిలో వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యం
పదో తరగతి వార్షిక పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా కృషి చేయాలని కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో సమీక్షించారు. విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. ఈ నెల 18 నుంచి ప్రీఫైనల్ పరీక్షలు షెడ్యూల్ ప్రకారం యథావిధిగా జరుగుతాయని, ఉపాధ్యాయులంతా సిద్ధంగా ఉండాలన్నారు. గతేడాది తరహాలోనే విద్యార్థులు త్వరగా నిద్రలేచి చదువుకునేలా ఉపాధ్యాయులు ‘వేకప్ కాల్స్’ ద్వారా వారిని అప్రమత్తం చేయాలన్నారు. ఇందులో ఇన్‌చార్జి జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్వర్, ఆయా పాఠశాలల హెడ్ మాస్టర్లు, మండల విద్యాశాఖ అధికారులు, ప్రత్యేక అధికారులు, మోడల్ స్కూల్ ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.
పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు


