ఆమెనే నిర్ణేత..!
కై లాస్‌నగర్: ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో నిర్ణయాధికారం అతివలదే. ఎన్నికల బరిలో నిలిచిన కౌన్సిలర్ అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్దేశించడంలో వారే కీలకపాత్ర పోషించనున్నారు. పట్టణ పరిధిలో పురుష ఓ టర్ల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉ న్నారు. అలాగే ము న్సిపల్ చైర్‌పర్సన్ పీఠాన్ని కూడా వారే అధిష్టించనున్నారు. ఇలా ఓట్లు.. సీట్లలోనూ మహిళల అధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. అభ్యర్థుల తలరాతలను మార్చే శక్తిగల మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు పలువురు ఇండిపెండెంట్ అభ్యర్థులు ప్రత్యేక దృష్టి సారించారు. వారి అనుగ్రహం పొందేందుకు అవసరమైన అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నారు. వారికి ప్రత్యేక తాయిలాలను ప్రకటిస్తూ ఓట్లు రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, చైర్‌పర్సన్ పీఠమే లక్ష్యంగా ఎన్నికల బరిలో నిలిచిన పలువురు మహిళా అభ్యర్థులు జనరల్ స్థానాల్లోనూ పోటీ చేస్తుండటం నారీ శక్తికి నిదర్శనంగా చెప్పవచ్చు.
సీట్లలోనూ వారిదే అధిపత్యం
ఓట్లలోనే కాదు.. సీట్లలోనూ మహిళల అధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఆదిలాబాద్ మున్సిపల్ పరి ధిలోని 49వార్డులకు గాను 23వార్డులను వారికే రిజ ర్వ్ చేశారు. ఆయా వార్డుల్లో మహిళలే పోటీ చేస్తున్నారు. పట్టణంలోని అన్ని వార్డుల పరిధిలో మొ త్తం 314మంది అభ్యర్థులు బరిలో నిలువగా ఇందులో అత్యధికంగా మహిళా అభ్యర్థులే ఉండటం ఆసక్తిని రేపుతోంది. సమాజంలో వస్తున్న మహిళా చైతన్యానికి నిదర్శనంగా నిలుస్తోంది.
మహిళలు 182.. పురుషులు 132
మహిళా అభ్యర్థులు అత్యధికంగా 182 మంది పోటీ చేస్తుండగా, పురుషులు 132 మంది మాత్రమే బరి లో ఉన్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్ స్థానం మహిళలకు రిజర్వ్ కావడంతో వారికి కేటాయించిన వార్డులతో పాటు జనరల్ స్థానాల్లోనూ మహిళలే పోటీ చేస్తున్నారు. చైర్‌పర్సన్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని భావిస్తున్న ప్రధాన పార్టీల ముఖ్య నేతలు జనరల్ స్థానాల్లో వారు పోటీ చేయకుండా తమ సతీమణులను బరిలో నిలిపారు. 27, 34, 48 వార్డులు జనరల్‌కు కేటాయించగా బీజేపీ తరఫున మహిళలు పోటీలో నిలిచారు. 2, 4, 18, 19, 49, 30 వార్డులు జనరల్‌కు రిజర్వ్ కాగా, కాంగ్రెస్ నేతలు తమ సతీమణులు, కుటుంబీకులను బరిలో నిలిపారు. 26, 27 వార్డుల్లో బీఆర్‌ఎస్ నేతలు తమ కుటుంబీకులను పోటీలో ఉంచారు. ఇలా రిజర్వ్‌డ్ స్థానాలతో పాటు జనరల్ స్థానాల్లోనూ మహిళలు పోటీ పడుతున్నారు. గెలుపే లక్ష్యంగా సర్వశక్తులు ఒడ్డుతున్నారు. కౌన్సిలర్‌గా విజయం సాఽధిస్తే చైర్మన్ పీఠాన్ని అఽధిరోహించవచ్చనే ఉద్దేశంతో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు.
నిర్ణయాధికారం ఆమెదే..
ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో మొత్తం 1,43,655 మంది ఓటర్లున్నారు. ఇందులో పురుష ఓటర్లు 69,813 మంది ఉండగా, మహిళా ఓటర్లు 73,836 మంది ఉన్నారు. ఇతరులు మరో ఆరుగురున్నారు. అయితే, పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు 4,023 మంది అధికంగా ఉన్నారు. ప్రతీ వార్డులోనూ మహిళా ఓటర్ల సంఖ్యే ఎక్కువ. ఆయా వార్డుల్లో పోటీ చేసిన కౌన్సిలర్ అభ్యర్థుల గెలుపోటములను నిర్దేశించగల శక్తి వారికే ఉంది. మహిళా ఓటర్లు ఏ పార్టీ అభ్యర్థి వైపు నిలబడుతారో వారే ఆ వార్డులో విజయాన్ని సొంతం చేసుకునే అవకాశముంది. అభ్యర్థుల గెలుపోటములను శాసించే అఽధికారం మహిళా ఓటర్లకే ఉంది. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ వారి ఓట్లు రాబట్టేందుకు పరితపిస్తున్నాయి. ఇందుకోసం అవసరమైన తాయిలాలను ప్రకటిస్తున్నాయి. ప్రత్యేక బహుమతులను అందజేయడంతో పాటు తాము గెలిస్తే మహిళల కోసం కాలనీలో ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని అభ్యర్థులు హామీలిస్తూ వారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.


