దేశ సంపద కార్పొరేట్లకు ధారాదత్తం
● వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బారావు ధ్వజం
సంతనూతలపాడు: దేశ సంపదనంతా కార్పొరేట్లకు ధారాదత్తం చేసే విధానాలను మోడీ ప్రభుత్వం అనుసరిస్తోందని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డి.సుబ్బారావు ధ్వజమెత్తారు. సీఐటీయూ జాతీయ మహాసభలను పురస్కరించుకొని స్థానిక సుందరయ్య భవన్‌లో మంగళవారం జరిగిన కార్మిక కర్షక ఐక్యతా సదస్సులో ఆయన మాట్లాడారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 11 ఏళ్లలో ఒక్కొక్కటిగా ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు అడ్డగోలుగా అమ్మేస్తుందన్నారు. దేశంలో ఉన్న పోర్టులు, విమానాశ్రయాలను ఆదానీ సంస్థకు కట్టబెట్టారని మండిపడ్డారు. రైల్వేమార్గాలు, రైళ్లను, రైల్వేస్టేషన్లను సైతం ప్రైవేట్‌పరం చేస్తున్నారన్నారు. వ్యవసాయాన్ని సర్వనాశనం చేసే నల్లచట్టాలు తీసుకువస్తే రైతులు, కార్మికులు, కూలీలు సంయుక్తంగా పోరాడి తిప్పికొట్టారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు మళ్లీ ఆ దుర్మార్గ చట్టాలను అమలు చేసేందుకు యత్నిస్తున్నారన్నారు. గ్రామాల్లో పని కల్పించే ఉపాధి హామీ చట్టాన్ని కూడా నిర్వీర్యం చేసి కార్పొరేట్లకు, భూస్వామ్య పెత్తందారులకు ఉడిగం చేసే చట్టాన్ని తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దుర్మార్గ చట్టాలకు వ్యతిరేకంగా కార్మిక, కర్షక, కష్టజీవులంతా సమైక్య ఉద్యమాలు సాగించాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం రమేష్ మాట్లాడుతూ చట్టాలన్నింటినీ కోడ్లుగా బలహీనపరిచారన్నారు. ఈ విధానాలను ప్రతిఘటించేందుకు కార్మిక, కర్షక ఐక్యతను మరింత బలోపేతం చేసేందుకు సీఐటీయూ మహాసభల్లో ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు నెరుసుల వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించిన కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు అబ్బూరి వెంకటేశ్వర్లు, కేజీ మస్తాన్, జి.బాలనాగయ్య, కంకణాల వెంకటేశ్వర్లు, అన్నవరపు శేషారావు తదితరులు పాల్గొన్నారు.


