భక్తిరస ప్రవాహినిగా శ్రీగిరి గిరిప్రదక్షిణ
ఒంగోలు మెట్రో: శ్రీవారి జన్మనక్షత్రం శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకొని మంగళవారం ఉదయం శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీగిరి ప్రదక్షణలో పాల్గొన్నారు. బాపూజీ గోశాలలో గోమాతలకు పూజ నిర్వహించి లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులను పల్లకిలో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం భక్తులు తమ భుజస్కంధాలపై పల్లకిని మోస్తూ గోమాత ముందు నడుస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ శంకుచక్రాలు, త్రిపుండ్రాలను గరుడ హనుమాన్ చిత్రాలను పట్టుకొని గిరి ప్రదక్షిణ పూర్తి చేసి శ్రీగిరిపై కొలువైయున్న అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు కలియుగ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. శ్రీగిరి ఆలయం ముంగిట డాక్టర్ బాలాజీ నాయక్ కిరణ్మయి అన్నమాచార్య కీర్తనకు భరతనాట్యం నృత్య ప్రదర్శనతో భక్తులను ఆకట్టుకుంది. శ్రీగిరి గిరి ప్రదక్షణకు విచ్చేసిన భక్తులకు శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ చాపల వంశీకృష్ణ నేతృత్వంలో వైద్యశాల సిబ్బంది షుగర్ వ్యాధి , బీపీ పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. గిరి ప్రదక్షణ కమిటీ అధ్యక్షులు రాధా రమణ గుప్తా జంధ్యం, ఉపాధ్యక్షులు తూనుగుంట మల్లికార్జునరావు, సహ కార్యదర్శి నేరెళ్ల శ్రీనివాసరావు, కార్యవర్గ సభ్యులు చలువాది బ్రహ్మయ్య, ధనిశెట్టి రామునాయుడు, విశ్వనాధుల వెంకట సుబ్బారావు విజయలక్ష్మి దంపతులు, సెనగేపల్లి నాగాంజనేయులు, నిర్వాహకులు నాగరవళి జయంత్ శర్మ దంపతులు భక్తులు పాల్గొన్నారు.


